సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే వేల కోట్ల రూపాయల విలువైన శీతల పానీయాల వ్యాపారానికి సంబంధించి పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది. కూల్‌డ్రింకులు తయారు చేసే రెండు అంతర్జాతీయ కంపెనీలు హిందుస్థాన్ కోకోకోలా, పెప్సీకోలా కంపెనీలు ఏటా రూ. 2వేల కోట్లకు పైగా విలువైన వ్యాపారం చేస్తూ, విలువ ఆధారిత పన్ను చెల్లిస్తున్నప్పటికీ... తరువాత అంచెల్లో పన్ను ఎగవేస్తున్నట్లు అధికారులు తేల్చారు.
కంపెనీల్లో తయారైన కూల్‌డ్రింకులు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల ద్వారా వినియోగదారులకు చేరుతాయి. ఈ క్రమంలో కూల్‌డ్రింక్ కంపెనీలు తాము డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించిన ధర మీద వ్యాట్ చెల్లిస్తున్నాయే తప్ప... డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు మాత్రం తాము జరిపే విక్రయాలపై లభించే మార్జిన్ మీద పన్ను చెల్లించడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన వాణిజ్యపన్నుల శాఖ తదుపరి చర్యలకు రంగంలోకి దిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కూల్‌డ్రింక్ కంపెనీల ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరిన ‘సరుకు’ వివరాలను సేకరించి ‘మార్జిన్’పై పన్ను చెల్లించని వారి గురించి ఆరా తీస్తోంది.
మూడు అంచెల్లోపన్ను చెల్లించాల్సిందే!
ఒక వస్తువు తయారై వినియోగదారుడికి చేరే ప్రక్రియలో మూడంచెల్లో ఎప్పటికప్పుడు విలువ ఆధారిత పన్ను చెల్లించాల్సి ఉంటుందని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. కంపెనీలో వస్తువు తయారై డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించిన ధరపై 14.5 శాతం పన్ను చెల్లించాలి. తరువాత డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్‌కు, రిటైలర్ నుంచి వినియోగదారుడికి చేరే సమయాల్లో కూడా వారికి లభించే ‘మార్జిన్’ మీద 14.5 శాతం మేర పన్ను చెల్లించాల్సిందే. కానీ కూల్‌డ్రింక్ వ్యాపారంలో అది జరగడం లేదని వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది. కోకోకోలా, పెప్సీ కోలా కంపెనీలు రూ. 2వేల కోట్ల టర్నోవర్‌పై రూ. 220 కోట్లు పన్ను చెల్లిస్తున్నాయి.
డిస్ట్రిబ్యూటర్, రిటైలర్లలో మెజారిటీ తమకు లభించే మార్జిన్ మీద పన్ను చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు డివిజన్‌లలోని అధికారులు 50 బృందాలుగా ఏర్పాటై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూల్‌డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల లావాదేవీల డేటాను సేకరించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 10 జిల్లాల్లోని కూల్‌డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లను టార్గెట్ చేసుకొని రెండు, మూడు అంచెల్లో జరిగిన కూల్‌డ్రింక్ అమ్మకాల వివరాలు సేకరిస్తున్నారు. వీటిని పరిశీలించి డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల నుంచి మార్జిన్ మీద పన్ను వసూలు చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా రూ. 100 కోట్ల వరకు పన్ను వసూలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పన్ను చెల్లింపుల్లో కూల్.. కూల్..!
Published Tue, Jun 28 2016 4:11 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM
Advertisement
Advertisement