ఇక పోలీసుల నుంచి తప్పించుకోలేరు! | No More Escape From The Police After A Criminal Activity | Sakshi
Sakshi News home page

ఇక పోలీసుల నుంచి తప్పించుకోలేరు!

Published Fri, Oct 11 2019 8:50 AM | Last Updated on Fri, Oct 11 2019 8:50 AM

No More Escape From The Police After A Criminal Activity - Sakshi

హత్యా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారి (ఫైల్‌)

కేసు నమోదుతోనే పోలీసుల పని అయిపోదు. నేర పరిశోధన చేయాలి. అన్ని ఆధారాలూ సేకరించాలి. సాక్ష్యాలను కోర్టు లో ప్రవేశపెట్టాలి. నేరాన్ని రుజువు చేయాలి. నిందితుడికి శిక్ష పడేలా చూడాలి. అప్పుడే కేసుకు న్యాయం చేసినట్లు.. పోలీసులు విజయం సాధించినట్లు.. ఇటీవలి కాలంలో కామారెడ్డిలో పలు కేసులను పోలీసులు ఛేదించారు. నిందితులకు శిక్ష పడేలా చేశారు. పోలీసులు, ప్రాసిక్యూషన్‌ కృషితో మూడు నెలల్లో ఐదు కేసుల్లో జీవిత ఖైదు పడడం గమనార్హం. 

సాక్షి, కామారెడ్డి: ఏ కేసులో అయినా పోలీసులు సరైన కోణంలో దర్యాప్తు చేసి న్యాయస్థానంలో సాక్ష్యాలను ప్రవేశపెడితే నిందితులు శిక్ష నుంచి తప్పిం చుకోలేరని ఇటీవల వెలువడిన తీర్పు లు స్పష్టం చేస్తున్నాయి. కామారెడ్డి జి ల్లా ఏర్పాటైన తరువాత ఎస్పీగా శ్వేత బాధ్యతలు స్వీకరించారు. ఆమె కేసుల నమోదు నుంచి నేర నిరూపణ వరకూ 

తమ సిబ్బందికి, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ పోలీసు యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఎస్పీ శ్వేతకు సాంకేతిక అంశాలపై మంచి పట్టు ఉంది. దీన్ని కేసుల ఛేదనకు ఉపయోగిస్తున్నారు. ఎక్కడ హత్య జరిగినా ఎస్పీ కూడా సంఘటన స్థలానికి వెళ్లడం, నేరస్తులను పట్టుకునేందుకు చేయాల్సిన పనులను అక్కడి అధికారులు, సిబ్బందికి సూచించడం ద్వారా చాలా కేసులను త్వరగా ఛేదించగలుగుతున్నారు. నిందితులకు శిక్షలూ పడుతున్నాయి. ఒక్క హత్య కేసులే కాకుండా దోపిడీ, దొంగతనాలు వంటి కేసుల్లోనూ జిల్లా పోలీసులు నిందితులను పట్టుకుని, శిక్ష పడే విషయంలో చురుకుగా పనిచేస్తున్నారు.  

ఆధారాల సేకరణ 
నేరస్థలంలో ఏ చిన్న ఆధారం దొరికినా నిందితుల వివరాలు సేకరించడం పెద్ద కష్టం కాదు. హతుడు గుర్తు తెలియని వ్యక్తి అయినపుడు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. హతుడు తెలిస్తేనే హంతకులు చిక్కుతారు. హతుడి వివరాలు తెలిస్తే హంతకులు ఎవరో తేలిపోతుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత వివరాల సేకరణ కొంత సులువైంది. ప్రధానంగా హతుడికి సం బంధించిన సెల్‌ఫోన్‌ నంబరు ఆధారంగా హత్యకు ముందు ఎవరితో మాట్లాడాడు అన్నది తె లుస్తోంది. హత్య కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు కీలకం.. నేరం జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు సేకరించడం ద్వారా నిందితులను గుర్తిస్తుంటారు. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు కూడా ఒక్కోసారి కేసులో కీలకంగా మారతాయి. పోలీసులు కేసు దర్యాప్తు అనంతరం ఆయా వివరాలను కేస్‌డైరీ రూపంలో న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. కేసు నమోదు నుంచి నిందితుల గుర్తింపు వరకు సాక్ష్యాధారాలు ఇతరత్రా అన్నింటినీ కోర్టు ముందుంచుతారు. కోర్టులో నమోదు చేసిన వివరాల్లో ఏ చిన్న పొరపాటు ఉన్నా నిందితుడి తరపున వాదించే డిఫెన్స్‌ లాయర్‌కు అవకాశం దొరుకుతుంది. కాబట్టి పోలీసులు సంబంధిత పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాయంతో పొరపాట్లకు తావులేకుండా కేసుడైరీ రూపొందిస్తున్నారు.

భార్యపై అనుమానంతో హత్య.. 
2009 ఫిబ్రవరి 2న సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వహీదా (35) అనే మహిళ హత్యకు గురైంది. తన భార్యపై అనుమానంతో ఆమె భర్త అబ్దుల్‌ హకీం పథకం ప్రకారం ఇంట్లో ఎవరూ లేనిది చూసి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత సదాశివనగర్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అప్పటి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేయగా.. సీఐ రవికుమార్‌ దర్యాప్తు చేపట్టారు. కొద్దిరోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన హకీం విదేశాలకు పారిపోవడంతో కేసు విచారణకు అంతరాయం ఏర్పడింది. పదేళ్ల తరువాత నిందితుడు సొంత గ్రామానికి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు.. అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. తొమ్మిది మంది సాక్షులను ప్రాసిక్యూషన్‌ తరపున ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండడంతో గతనెల 26న కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి బి.సత్తయ్య తీర్పు వెల్లడించారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు. కేసు పరిశోధనలో, సాక్షాధారాలను రుజువు చేయడంలో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అమృత్‌రావు వైద్య, ఎస్సై లింబారెడ్డి, కోర్టు డ్యూటీ అధికారి రాజారాం సాయిలు చురుకుగా పనిచేశారు. 

కన్నతల్లిని చంపిన కొడుకు.. 
2017 ఆగస్టు 10న దేవునిపల్లి గ్రామానికి చెందిన నోముల వెంకటలక్ష్మి (65) అనే వృద్ధురాలు తన ఇంట్లోనే దారుణహత్యకు గురైంది. అప్పటి రూరల్‌ సీఐ కోటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. విచారణ జరుపగా మృతురాలి కుమారుడు సత్యనారాయణే హత్య చేశాడని తేలింది. అతడు తరచుగా డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. స్థలాన్ని విక్రయించగా వచ్చిన డబ్బుల కోసం సంఘటన జరిగిన రోజు కూడా తల్లికొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. తన తల్లిని చంపితే కానీ డబ్బులు దక్కవని భావించిన సత్యనారాయణ.. 2017 ఆగస్టు 10న సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి ఇంట్లో ఒంటరిగా ఉండగా వెదురు నరికే కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తన స్నేహితులకు ఫోన్‌ చేసి గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హతమార్చారని సమాచారం ఇచ్చాడు. పోలీసులు విచారణలో నేరం వెల్లడైంది. దీంతో ప్రాసిక్యూషన్‌ తరపున 11 మంది సాక్షులను, సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో తల్లిని హత్య చేసిన సత్యనారాణయణకు జీవిత ఖైదు, రూ.500 జరిమానా, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరో మూడేళ్లు, జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ గతనెల 26న న్యాయమూర్తి బి.సత్తయ్య తీర్పు వెల్లడించారు. ఈ కేసు పరిశోధనలోనూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అమృతరావు, సీఐ కోటేశ్వర్‌రావు, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌ లింబారెడ్డి, కోర్టు కానిస్టేబుల్‌ రమేశ్‌ తదితరులు చురుకుగా పనిచేశారు.

భార్యను చంపిన భర్త.. 
2015 ఏప్రిల్‌ 27న గాంధారి మండలం వండ్రికల్‌కు చెందిన సుమలత అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురా లి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆ మె భర్త చిన్నప్ప ఉరివేసి చంపాడని ని ర్ధారించారు. సరైన సాక్షాధారాలను ప్రవేశపెట్టడంతో నిందితుడికి గత నెల 15న నిజామాబాద్‌ ఫ్యామిలీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుదర్శన్‌రెడ్డితో పాటు పోలీసులు చురుకుగా పనిచేశారు. ఇటీవలి కాలంలో మరో రెండు కేసుల్లోనూ ఇద్దరికి జీవిత ఖైదు పడింది. 

నేరస్తులకు శిక్ష పడాల్సిందే.. 
నేరాలను అరికట్టడం ఎంత ముఖ్యమో నేరం చేసిన వారికి శిక్ష పడేలా చూడడం కూడా అంతే ముఖ్యం. జిల్లాలో ఇటీవలి కాలంలో ఐదుగురు నేరస్తులకు జీవిత ఖైదు పడింది. ఆయా కేసుల పరిశోధనలో పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ల కృషి అభినందనీయం. నేరస్తులకు శిక్షలు పడినప్పుడు ఇతరులు నేరం చేయాలంటే కొంత వెనుకంజ వేస్తారు. అందుకే నేరం చేసిన వారికి శిక్షలు పడడం న్యాయం.   
  – ఎన్‌.శ్వేత, ఎస్పీ, కామారెడ్డి 

శిక్ష భయంతో నేరాలు తగ్గుతాయి
సాక్ష్యాలు తారుమారు కాకుండా పక్కాగా చర్యలు తీసుకోవడం మూలంగా శిక్షలు సాధ్యమవుతున్నాయి. ప్రాసిక్యూషన్‌ వ్యవస్థలో సమూలమైన మార్పులు జరుగుతున్నాయి. సాక్ష్యాలతో పాటు సాంకేతిక అంశాలను జోడించడంతో నేరస్తులు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కేసుల నిరంతర పర్యవేక్షణ మూలంగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. గతంలోలాగా కాకుండా నేరం చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఏర్పడడం వల్ల నేరాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.                  
 –వైద్య అమృత్‌రావు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, కామారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement