కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్మెల్యే రఘురామ ఈ మెయిల్‌తో కేసు నమోదు
ఐపీఎస్‌లు సునీల్‌కుమార్, పీఎస్‌ఆర్‌తోపాటు మాజీ సీఎం జగన్‌పై కేసులు
గతంలో ఇదే అంశంపై కోర్టులను ఆశ్రయించిన రఘురామ
ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పిన వైద్య నివేదిక
దాంతో ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు, సుప్రీం కోర్టు
అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా తాజాగా కేసు నమోదు
చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్న న్యాయ నిపుణులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా నారా లోకేశ్ తయారు చేసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్నట్లు మరోసారి నిరూపితమైంది! ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితం తోసిపుచ్చిన ఆరోపణల ఆధారంగా కూటమి సర్కారు తాజాగా తప్పుడు కేసు నమోదు చేయడమే అందుకు తాజా నిదర్శనం.
2021లో తనను సీఐడీ అధికారుల కస్టడీలో గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని.. హింసించారని నాటి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య పరీక్షలు గతంలోనే నిర్ధారించాయి. ఆ ఆరోపణల ఆధారంగా రఘురామకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా, అదే ఆరోపణల ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సుప్రీం కోర్టు సైతం తిరస్కరించింది. తాజాగా అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించేందుకు బరి తెగించింది.
నాడు న్యాయస్థానాలు తోసిపుచ్చిన ఆరోపణలతోనే రఘురామరాజు మూడేళ్ల తరువాత మెయిల్‌లో ఫిర్యాదు చేయడం... ఆ వెనువెంటనే ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు, నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలతోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసులు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ చర్య కక్ష సాధింపే కాదు.. కోర్టు ధిక్కారమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకానికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
బెడిసికొట్టిన పన్నాగం.. రఘురామను హింసించలేదన్న వైద్య నివేదికలు
సమాజంలో వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న కె.రఘురామకృష్ణరాజుపై సీఐడీ అధికారులు 2021 మే నెలలో కేసు నమోదు చేశారు. ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసే సమయంలో సీఐడీ అధికారులపై దాడికి పాల్పడినా ఎంతో సంయమనం పాటిస్తూ మంగళగిరిలోని ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ క్రమంలో రఘురామరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన ప్లేటు ఫిరాయించి గుంటూరు మెజి్రస్టేట్ కోర్టులో హాజరుపరిచిన సమయంలో అసత్య ఆరోపణలు చేశారు.
కస్టడీలో సీఐడీ అధికారులు తనను కొట్టారని... హింసించారని ఆరోపిస్తూ బెయిల్ ఇవ్వాలని కోరారు. మరోవైపు తనను సీఐడీ అధికారులు కస్టడీలో హింసించారని ఆరోపిస్తూ దానిపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఆయనకు వైద్యుల బృందంతో పరీక్షలు నిర్వహించి నివేదిక సమ ర్పించాలని గుంటూరు జీజీహెచ్ వైద్య అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో నలుగురు వైద్యుల బృందం రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఎక్స్‌రే, స్కాన్లు తీసింది.
రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. సీఐడీ అధికారులు కస్టడీలో ఆయన్ను శారీరకంగా హింసించలేదని నిర్ధారించింది. అదే విషయాన్ని హైకోర్టుకు నివేదించింది. సీఐడీ అధికారులు నిజంగానే కస్టడీలో శారీరకంగా హింసించి ఉంటే అవి ఎక్స్‌రే, స్కాన్ రిపోర్టులలో బయటపడేవి. అలాంటిది ఏమీ లేకపోవడంతో వైద్య బృందంలోని నలుగురు డాక్టర్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ నివేదిక సమర్పించారు. ఒకవేళ నలుగురు వైద్యుల్లో ఎవరైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి ఉంటే మరోసారి వైద్య పరీక్షలు చేయాలని ఇతర ఆస్పత్రులకు హైకోర్టు అప్పుడే ఆదేశించి ఉండేది.
ఈ నేపథ్యంలో రఘురామను సీఐడీ అధికారులు శారీరకంగా హింసించలేదని పూర్తి ఆధారాలతో వైద్యులు నిగ్గు తేల్చిన నివేదికను హైకోర్టు ఆమోదించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో రఘురామను జ్యుడిషియల్ కస్టడీ కోసం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తమ కస్టడీలో ఉన్న నిందితుడిని జైలుకు తరలించడంతో సీఐడీ / పోలీసు అధికారుల బాధ్యత ముగుస్తుంది. తరువాత పరిణామాలతో వారికి సంబంధం ఉండదు.
సుప్రీం తీర్పులు పట్టవా?
ఏదైనా కేసులో 77 రోజుల తరువాత సాక్షులను విచారించడం సరికాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. రఘురామ ఫిర్యాదు విషయంలో ఏకంగా మూడేళ్ల తరువాత... అదీ అప్పటికే ఆ ఆరోపణలతో దాఖలైన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాలతో చంద్రబాబు ప్రభుత్వం కేసు నమోదు చేయడం విస్మయపరుస్తోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసుల చర్య కచ్చితంగా కక్ష సాధింపేనని స్పష్టం చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే తోసిపుచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం కోర్టు ధిక్కారమేనని తేల్చి చెబుతున్నారు.
ఆరోపణలు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు
తిరస్కరణహైకోర్టులో చుక్కెదురు కావడంతో రఘురామ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుంటూరు జిల్లా జైలులో ఒక రోజు ఉన్న తరువాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం అక్కడి నుంచి పోలీసుల వాహనంలో కాకుండా తన సొంత వాహనంలో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రికి వెళ్లారు. రెండు రోజుల తరువాత ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను పోలీసులు కొట్టినట్టు ఆ వైద్య పరీక్షల్లోనూ వెల్లడి కాలేదు.
అయితే సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించిన ఆయన.. సీఐడీ కస్టడీలో తనను గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామరాజు ఆరోపణలను తోసిపుచ్చింది. సీబీఐ విచారణ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దాంతో రఘురామ ఎత్తుగడ బెడిసికొట్టింది. తనను సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని, శారీరకంగా హింసించారంటూ రఘురామ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నిర్ధారణ అయ్యింది. దాంతో ఆ అధ్యాయానికి తెర పడింది.
కక్ష సాధింపుతో తప్పుడు కేసు.. ఒక రోజు ముందే పోలీసులకు ఉప్పు..
రెడ్ బుక్ రాజ్యాంగాన్నే తమ ప్రభుత్వం అనుసరిస్తుందని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. రఘురామను సీఐడీ అధికారులు కస్టడీలో హింసించలేదని నిర్థారిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను బేఖాతర్ చేశారు. గుంటూరు జీజీహెచ్, హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యుల నివేదికలను బుట్ట దాఖలు చేస్తూ కేవలం కక్ష సాధింపే తమ విధానమని మరోసారి చాటుకున్నారు. 2021 మేలో తనను సీఐడీ అధికారులు కస్టడీలో హింసించారని ఆరోపిస్తూ మూడేళ్ల తరువాత రఘురామరాజు ఈ ఏడాది జూన్ 11న పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
మూడేళ్ల క్రితం తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని కోర్టులో పిటిషన్ వేసిన ఆయన.. ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం 2021లో సీఐడీ అదనపు డీజీగా ఉన్న పీవీ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు(వాస్తవానికి అప్పట్లో ఏసీబీ అదనపు డీజీగా ఉన్నారు)తోపాటు నాటి సీఎం జగన్‌ను నిందితులుగా పేర్కొనడం గమనార్హం. వారితోపాటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ ప్రభావతి, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌పై కూడా ఆరోపణలు చేశారు.
మరో విచిత్రమేంటంటే రఘురామరాజు ఈ ఏడాది జూన్ 11న ఫిర్యాదు చేయగా అంతకు ఒకరోజు ముందే అంటే జూన్ 10నే ఆయన ఫిర్యాదుపై పోలీసులు న్యాయ సలహా కోరారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తోందో స్పష్టమవుతోంది. రఘురామ ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరపాలెం పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్, ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్, డాక్టర్ ప్రభావతిలతోపాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment