జగన్ చెప్పిందే కరెక్ట్! సుప్రీం కూడా ఇవాళ అదే.. | Tirumala Laddu Petitions: Jagan Was Correct, SC Angry With Chandrababu; Details Here | Sakshi
Sakshi News home page

జగన్ చెప్పిందే కరెక్ట్! సుప్రీం కూడా ఇవాళ అదే..

Published Mon, Sep 30 2024 3:51 PM | Last Updated on Mon, Sep 30 2024 4:45 PM

Tirumala Laddu Petitions: Jagan Was Correct, SC Angry With Chandrababu; Details Here

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఆధారాల్లేకుండా.. దర్యాప్తు అడుగు పడకుండానే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే  ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందు నుంచి చెబుతున్న విషయాల్నే.. ఇవాళ సుప్రీం కోర్టు ప్రముఖంగా ప్రస్తావించించడం గమనార్హం.

తిరుమల లడ్డూ వివాదంపై జగన్‌ మొదటి నుంచి ఏం చెబుతూ వస్తున్నారో.. దాదాపు అలాంటి వ్యాఖ్యలే ఇవాళ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం చేసింది. వాటి మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే..

 

అంతా బాబు హయాంలోనే..
‘జులై 12న నమూనాలు తీసుకున్నారు. వాటిని పరీక్షిస్తే సరిగా తేలలేదని, జులై 17న ఎన్‌డీడీబీకి వాటిని పంపారు. వాటిపై ఆ సంస్థ జులై 23న నివేదిక ఇచ్చింది. కానీ 2 నెలల తర్వాత.. ఇప్పుడు బయటకు తీసి టీడీపీ కార్యాలయంలో విడుదల చేశారు’

సుప్రీం కోర్టు ఇవాళ.. 
ఎన్‌డీడీబీ నివేదికను సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన సమయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జులైలో రిపోర్ట్‌ వచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేపనూనె, జంతువుల కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ రిపోర్టు పేర్కొంది. జులైలో నివేదిక వస్తే.. దానిని సెప్టెంబర్‌లో చెప్పారు.. ఎందుకు?. ఈ నివేదికపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది?.


స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తావా? 
పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదు. పచ్చి అబద్ధాలు వల్లె వేసి తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను సీఎం చంద్రబాబు అబాసుపాలు చేశారు. పరమ పవిత్రమైన లడ్డూ విశిష్టతకు దెబ్బతీశారు. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారు. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు చెబుతున్నారు.

సుప్రీం కోర్టులో ఇవాళ
ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రపంచంలోని భక్తులందరి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాఖ్యలతో వాళ్ల మనోభావాలు దెబ్బతీశారు. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దు. ఈ అంశంపై నేరుగా మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా.సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు  వెరిఫై చేసుకోవాలి. సీఎం వ్యాఖ్యలతో కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయి.


వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూ
టీటీడీ ట్రస్ట్‌ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్‌ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. జూన్‌ 12, జూన్‌ 21, జూన్‌ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్‌ అయి ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు. ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి టీటీడీ టెస్టుల్లో ఫెయిల్‌ కావడంతో వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. సాధారణంగా మరోసారి ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు పంపి­స్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్‌పై ఎన్‌డీడీబీ జూలై 23న రిపోర్ట్‌ పంపింది. 

.. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చారు. మరి ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా.. ఆ నెయ్యిని వాడారని రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు?. ఆ నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశాం. షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్‌ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్‌ క్లియర్‌గా ఈవో చెప్పినా... రెండు నెలల తర్వాత చంద్రబాబు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారు. అన్నీ తెలిసినా.. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని.. లడ్డూలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.

సుప్రీం కోర్టులో ఇవాళ.. 
లడ్డూ కల్తీ అయ్యిందని చెప్పడానికి మీ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో  వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా ? అసలు కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా ?. నెయ్యి రిజెక్ట్‌ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా?. ఇదంతా పబ్లిక్ డొమైన్‌లో ఉంది కదా?. 

పరీక్షలకు ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు?. ఇంకా ఎన్నో ల్యాబ్‌ సంస్థలు ఉన్నాయి కదా!. మైసూర్‌ లేదంటే గజియాబాద్‌ ల్యాబ్‌ల నుంచి సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదు?.  లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్‌ను ల్యాబ్‌కు ఏమైనా పంపించారా?. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిట్లు ప్రాథమికంగా ఆధారాల్లేవ్‌.  అసలు దర్యాప్తునకు వెళ్లకుండానే లడ్డూ కల్తీ అయ్యిందని సీఎం స్టేట్‌మెంట్‌ ఎలా ఇచ్చారు?’’ అని టీటీడీ లాయర్‌ సిదార్థ్‌ లూథ్రాను ప్రశ్నించింది. 

జగన్‌ సంధించిన ప్రశ్నలకు చం‍ద్రబాబు అండ్‌ కోకు ఎలాగైతే నోళ్లు మూతలు పడ్డాయో.. ఇవాళ సుప్రీం ధర్మాసనం సంధించిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వలేక సీనియర్‌ లాయర్‌ లూథ్రా తడబడ్డారు.

ఇదీ చదవండి: దీని అర్థం ఏంటి బాబూ?: వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement