తిరుమల లడ్డూ ప్రసాదంపై ఇంకా కొనసాగుతున్న రాజకీయం
ఎక్స్ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం
చంద్రబాబుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా అదే వైఖరి
రాజకీయ దుర్బుద్ధితో భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన బాబు
వాటన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకున్న సుప్రీంకోర్టు
పొలిటికల్ డ్రామా చేయొద్దంటూ అక్షింతలు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ రద్దు
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశం
కల్తీ నెయ్యి వాడనేలేదని టీటీడీ ఈవో స్వయంగా ప్రకటన
అయినా పదే పదే అదే అబద్ధం వల్లె వేస్తున్న బాబు, టీడీపీ
చంద్రబాబుకు భయం, భక్తి ఉంటే వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
తన ప్రసంగం వీడియోను ప్రధాని, కేంద్ర మంత్రులు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు, వాటి నేతలకు ట్యాగ్
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ లడ్డూ ప్రసాదం విషయంపై టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆక్షేపించారు. సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించాక తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోను ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీల నేతలకు ట్యాగ్ చేస్తూ శనివారం ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు.
ఆ వీడియోలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు? ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్‌డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? ఎన్‌డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు.. దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా? ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది.
ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్‌డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు సెప్టెంబరులో మాట్లాడినట్లు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడుతారు?’.. అని సుప్రీంకోర్టు గత 30వ తేదీన వ్యాఖ్యానించింది అని చెప్పారు.
Even after the critical remarks of the Hon’ble Supreme Court against @ncbn , TDP continues to politicize the Laddu Prasadam issue. @BJP4India @INCIndia @arivalayam @BRSparty @samajwadiparty @AamAadmiParty @AIADMKOfficial @narendramodi @AmitShah @ShivSenaUBT_ @AITCofficial… pic.twitter.com/vefByATGT6
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024
ఈవో, సీఎం పరస్పర విరుద్ధ ప్రకటనలు
‘ఎఫ్‌ఐఆర్ సెప్టెంబరు 25న రిజిస్టర్ చేస్తే.. అంతకు ముందే సెప్టెంబరు 18న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సిట్ ఏర్పాటైంది సెప్టెంబరు 26న అయితే.. అంతకన్నా ముందే ఎలా ప్రకటన ఇచ్చాడంటూ.. సీఎం బహిరంగ ప్రకటన కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని కోర్టు చెప్పింది. ఇన్ని రకాలుగా చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అయితే మళ్లీ ఇవాళ కూడా.. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తప్పును సుప్రీంకోర్టు ఎత్తి చూపింది.
బాబు తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్‌ను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, వారికి సహకారం అందించడానికి ఇద్దరు రాష్ట్ర అధికారులు.. వీరికి తోడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఒకరు నియమితులవుతారని.. వీరందరూ లడ్డూకి సంబంధించిన విషయంపై నివేదిక ఇస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత తిరుమలలో తప్పు చేశానని స్వామి వారిని వేడుకోవాలి. అవేవీ చేయడం లేదు. టీడీపీ దుష్ప్రచారం ఆపలేదు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment