జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా)/అనకాపల్లి టౌన్: గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయతీ గాదిగుంట గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న ఐదు ఎకరాల్లోని గంజాయి పంటను ఎస్‌ఐ శ్రీనివాస్‌తో కూడిన బృందం మంగళవారం గుర్తించింది. గ్రామస్తుల సహకారంతో గంజాయి మొక్కలను ఒక చోటకు చేర్చి తగులబెట్టారు. పారిపోతున్న ముగ్గురు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు.
నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం కొత్తూరు ఏఎంఏఎల్ కళాశాల కూడలిలో మంగళవారం 280 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ జంక్షన్‌లో ఎస్‌ఐ సింహాచలం వాహనాలను సాధారణ తనిఖీ చేస్తుండగా అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళ్తున్న కారులో గంజాయి బయటపడింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కారు డ్రైవర్ తూము బాలిరెడ్డిని అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గంజాయి విలువ సుమారు రూ.5.5 లక్షలు ఉంటుందని సీఐ దాడి మోహన్‌రావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment