న్యూఢిల్లీ: ఉచిత హామీల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్ట జూస్తున్నాయంటూ రాజకీయ పార్టీలపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరిపే అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు హిందూసేన ఉపాధ్యక్షుడు సుర్జీత్‌సింగ్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించాలన్న విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం పరిశీలించింది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తున్నందున దీన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఆయన తరఫు న్యాయవాది ధర్మానానికి విన్నవించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇచ్చిన పలు ఉచిత హామీలతో తాను కలత చెందినట్టు పిటిషన్లో యాదవ్ పేర్కొన్నారు. దీన్ని అవినీతి చర్యగా, సదరు పార్టీల తరఫు అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాలను, కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆప్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఉచిత హామీల బడ్జెట్ కొన్నిసార్లు అసలు బడ్జెట్‌నూ మించిపోతోందంటూ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ వేసిన పిల్‌పై కేంద్రానికి, ఈసీకి అంతకుముందు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment