విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియో రికార్డింగ్
నెలసరి సమయంలోనూ ప్రార్థనకు రావాలని వేధింపులు... విసిగిపోయి రోడ్డెక్కిన గిరిజన గురుకుల విద్యార్థినులు
గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్
పీఈటీ జ్యోత్స్న సస్పెన్షన్, కేసు నమోదు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటలకు పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు.
అనంతరం విద్యార్థినులు మీడియాకు తమగోడు వెళ్లబోసుకుంటూ.. ఐదేళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతోందన్నా రు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్‌రూమ్‌లలో స్నానం చేస్తుండగా ప్రార్థన సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారని ఆగ్రహంతో బాత్‌రూమ్‌ల తలుపులు పగులగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్‌లో వీడియో తీయడంతోపాటు కర్ర తో చితకబాదారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూ రల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేయగా.. బాలికలు మరోసారి పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు.
రంగంలోకి కలెక్టర్.. పీఈటీ సస్పెన్షన్
గిరిజన బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌తో మాట్లాడి అప్పటికప్పుడు పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. పీఈటీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ పద్మను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పీఈటీ జ్యోత్స్నపై కేసు నమోదైంది.
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలిగాడు.
ఈ విషయమై హెచ్‌ఎంను వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని విద్యార్థినులు తన దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment