
యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు..
వండిన కూర సీజ్, పోలీసులకు ఫిర్యాదు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్ తన చానల్‌లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ శ్రీటీవీ అనే యూట్యూబ్ చానల్‌లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్‌లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.
తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రవణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment