ఫేస్బుక్ తెచ్చిన తంటా.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత
డెహ్రాడూన్: సదాశయంతో నెలకొల్పిన సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్బుక్ను కొందరు వ్యక్తులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి, తప్పుడు ప్రచారాలకు కూడా వాడుకుంటున్నారు. ఓ మత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఓ యువకుడు ఫేస్బుక్లో ఫొటోలను అప్లోడ్ చేశాడు. దీంతో ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లా రామ్నగర్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
ఓ మతానికి చెందిన ప్రజలు ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చారు. శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వారని అడిషనల్ డీజీ రామ్ సింగ్ మీనా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు కూడా జరగినట్టు తెలిపారు. కాగా ఈ సంఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని చెప్పారు. ఫేస్బుక్లో 26 ఏళ్ల రాజీవ్ అనే వ్యక్తి ఫొటోలు ఉంచినట్టు గుర్తించారు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్పారు.