communal tension
-
రాళ్ల దాడి, 144 సెక్షన్ అమలు
షిల్లాంగ్: మత ఘర్షణలు చెలరేగొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు కర్ఫ్యూ విధించారు. తమ మతానికి చెందిన పిల్లలపై దాడి చేశారంటూ మరో మతానికి చెందినవారు నిరసనలకు దిగడంతో.. షిల్లాంగ్ నగరంలో వాణిజ్య కేంద్రమైన మోట్‌ఫ్రాన్ ఉద్రిక్తలకు కేంద్రంగా మారింది. గురువారం రాత్రి నుంచి అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి. వివరాలు.. గురువారం ఉదయం తన పిల్లలపై ఏ కారణం లేకుండా ఒక వర్గానికి చెందిన మహిళ దాడి చేసిందని ఓ బస్ డ్రైవర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల చొరవతో ఆ గొడవ సామరస్యంగా సద్దుమణిగింది. కానీ, తన కొడుకును అకారణంగా గాయపరిచిన వారిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు బాధితుని తండ్రి సిద్ధమయ్యాడు. ఇరుగు పొరుగు వారిని, సహోద్యోగులను మతం పేరుతో రెచ్చగొట్టి గురువారం రాత్రి మోట్‌ఫ్రాన్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి, పాత్రికేయుడు, మరి కొంతమంది గాయపడ్డారు. ఈ ఘర్షణ శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. పరిస్థితి అదుపు తప్పి మత ఘర్షణలకు దారి తీయొచ్చని భావించిన ఖాసీ హిల్స్ (తూర్పు) డిప్యూటీ కమిషనర్ పీటర్ ఎస్.దిఖార్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపి వేశారు. కర్ఫ్యూతో ఉద్రిక్తతలు సద్దుమణిగాయని ఆయన తెలిపారు. జయా, మావ్‌ఖర్, ఉమ్‌సోసన్, రియత్సంతియా, వాహింగ్దా, మిషన్, మాప్రేమ్, లున్‌డింగ్రీ, అమా విల్లా, ఖ్వాలాపతి, వాతప్రూ, సన్నీ హిల్, కంటోన్మెంట్, మావ్‌లంగ్‌లలో కర్ఫ్యూ విధించారు. -
దేశంలో అల్లకల్లోలానికి దావూద్ ప్లాన్
న్యూఢిల్లీ: దేశంలో అరాచకం సృష్టించేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుట్రలు చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. దేశ వ్యాప్తంగా మత ఘర్షణలు పెంచడంతోపాటు ఆయా మతాలకు సంబంధించిన నాయకులను టార్గెట్ చేశాడని, వారిలో ముఖ్యంగా ఆరెస్సెస్ నాయకులు, చర్చిలు, చర్చిల ఫాథర్లు లక్ష్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీకి చెందిన పదిమందిపై శనివారం చార్జిషీట్ దాఖలు చేయనుంది. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో శాంతి అనేదే లేకుండా చేయాలని వారు కుట్ర పన్నినట్లు ఆ చార్జీషీట్లో పేర్కొంది. గత ఏడాది నవంబర్ 2న దావూద్ కంపెనీకి చెందిన షార్ప్ షూటర్స్ ఆరెస్సెస్ కు చెందిన శిరిష్ బెంగాలీ, ప్రగ్నీష్ మిస్త్రీలను గుజరాత్‌లోని భారుచ్‌లో చంపేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని అరెస్టు చేయగా 1993 ముంబయిలో వరుస బాంబు పేలుళ్లకు కారకుడైన యాకుబ్ మెమన్ను ఉరితీశారన్న కక్షతో వారిని చంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ షురూ చేసిన ఎన్ఐఏ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆ లీడర్ల హత్య మాత్రమే కాకుండా మొత్తం దేశంలోనే అల్లకల్లోలం సృష్టించేందుకు భారీ పథకం పన్నినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. -
ఫేస్బుక్ తెచ్చిన తంటా.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత
డెహ్రాడూన్: సదాశయంతో నెలకొల్పిన సోషియల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ను కొందరు వ్యక్తులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి, తప్పుడు ప్రచారాలకు కూడా వాడుకుంటున్నారు. ఓ మత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఓ యువకుడు ఫేస్బుక్లో ఫొటోలను అప్లోడ్ చేశాడు. దీంతో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా రామ్‌నగర్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఓ మతానికి చెందిన ప్రజలు ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చారు. శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారని అడిషనల్ డీజీ రామ్ సింగ్ మీనా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు కూడా జరగినట్టు తెలిపారు. కాగా ఈ సంఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని చెప్పారు. ఫేస్బుక్లో 26 ఏళ్ల రాజీవ్ అనే వ్యక్తి ఫొటోలు ఉంచినట్టు గుర్తించారు. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్పారు.