ఉద్రిక్త పరిస్థితుల్లో షిల్లాంగ్..
షిల్లాంగ్: మత ఘర్షణలు చెలరేగొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు కర్ఫ్యూ విధించారు. తమ మతానికి చెందిన పిల్లలపై దాడి చేశారంటూ మరో మతానికి చెందినవారు నిరసనలకు దిగడంతో.. షిల్లాంగ్ నగరంలో వాణిజ్య కేంద్రమైన మోట్‌ఫ్రాన్ ఉద్రిక్తలకు కేంద్రంగా మారింది. గురువారం రాత్రి నుంచి అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి.
వివరాలు.. గురువారం ఉదయం తన పిల్లలపై ఏ కారణం లేకుండా ఒక వర్గానికి చెందిన మహిళ దాడి చేసిందని ఓ బస్ డ్రైవర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల చొరవతో ఆ గొడవ సామరస్యంగా సద్దుమణిగింది. కానీ, తన కొడుకును అకారణంగా గాయపరిచిన వారిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు బాధితుని తండ్రి సిద్ధమయ్యాడు.
ఇరుగు పొరుగు వారిని, సహోద్యోగులను మతం పేరుతో రెచ్చగొట్టి గురువారం రాత్రి మోట్‌ఫ్రాన్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి, పాత్రికేయుడు, మరి కొంతమంది గాయపడ్డారు. ఈ ఘర్షణ శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది.
పరిస్థితి అదుపు తప్పి మత ఘర్షణలకు దారి తీయొచ్చని భావించిన ఖాసీ హిల్స్ (తూర్పు) డిప్యూటీ కమిషనర్ పీటర్ ఎస్.దిఖార్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇంటర్‌నెట్ సేవలు కూడా నిలిపి వేశారు. కర్ఫ్యూతో ఉద్రిక్తతలు సద్దుమణిగాయని ఆయన తెలిపారు. జయా, మావ్‌ఖర్, ఉమ్‌సోసన్, రియత్సంతియా, వాహింగ్దా, మిషన్, మాప్రేమ్, లున్‌డింగ్రీ, అమా విల్లా, ఖ్వాలాపతి, వాతప్రూ, సన్నీ హిల్, కంటోన్మెంట్, మావ్‌లంగ్‌లలో కర్ఫ్యూ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment