సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టు దాడికి ప్రతీకారంగా కశ్మీర్ వీధులు తగులబడి పోతుంటే మరోపక్క దేశంలోని పలు ప్రాంతాల్లో కశ్మీర్ విద్యార్థులు లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, హర్యానాలోని అంబాలా, రాజస్థాన్‌లోని జైపూర్, బీహార్‌లోని పట్నా నగరాల్లో కశ్మీర్ విద్యార్థులు లక్ష్యంగా కళాశాలలు, హాస్టళ్లు, అద్దె ఇళ్లు లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ దాడులు నేటికి కొనసాగుతున్నాయి.
కశ్మీరు విద్యార్థులకు ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులు దాడులకు భయపడి వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని చోట్ల కశ్మీరు విద్యార్థుల సామాన్లను బయటపడేసి నిర్దాక్షిణ్యంగా తలుపులు వేసుకుంటున్నారు. కొంత మంది మానవతావాదులు మాత్రం కశ్మీర్ విద్యార్థులున్న రూములకు బయట నుంచి తాళాలు వేసి తమ ఇంట్లో కశ్మీరీ విద్యార్థులు లేరంటూ వారిని రక్షించేందకు ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఆపదలో ఉన్న విద్యార్థుల గురించి ‘జమ్మూ, కశ్మీరు విద్యార్థి సంఘం’ రంగప్రవేశం చేసి వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీలైనన్ని చోట్ల రూములను అద్దెకు తీసుకొని రోడ్డున పడ్డ విద్యార్థులకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తోంది.
గత రెండు రోజులుగా పచ్చి మంచినీళ్లు తప్ప ఎలాంటి ఆహారం లేకుండా చీకటి గదుల్లో తలదాచుకున్నామంటూ కొంత మంది విద్యార్థులు తమ గాధలను మీడియాకు వివరిస్తుంటే, ఇలాంటి కష్టాలు తమకు కొత్త కాదని, మున్ముందు తమ చదువులు కొనసాగుతాయా, లేదా ? భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలు వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని అల్పైన్ కళాశాలలో రసాయన శాస్త్రంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇంతియాజ్ అహ్మద్ మీర్, మరో 29 మంది విద్యార్థులు దాడులకు భయపడి చండీగఢ్ చేరుకున్నారు. అక్కడ వారికి కశ్మీర్ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆశ్రయం పొందారు.
ఢిల్లీలోని మెడికల్ సైన్సెస్ అండ్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జావెద్ అక్తర్ స్వగ్రామమైన కుప్పారలోని లోలబ్‌కు తిరిగి వస్తూ మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. ఆయన కూడా ప్రస్తుతం చండీగఢ్ శిబిరంలో ఆశ్రయం తీసుకున్నారు. కత్తులు, కర్రల ధరించి దాదాపు 40 మంది తమ కాలేజీ వద్దకు వచ్చి తమను బెదిరించారని, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, కళాశాలల్లోగానీ, నగరంలోగానీ ఒక్క కశ్మీరీ కూడా ఉండరాదంటూ హెచ్చరికలు చేశారని మీర్ తెలిపారు.
చండీగఢ్‌లో తాము ప్రస్తుతం నాలుగు ఫ్లాట్స్ తీసుకున్నామని, వాటిలో 20 రూములు ఉన్నాయని, వంద మందికి ఆశ్రయం కల్పించే అవకాశం ఉందని, అయితే మధ్యలో చిక్కుబడి చండీగఢ్‌కు చేరుకున్న కశ్మీర్ విద్యార్థులు దాదాపు వెయ్యి మంది ఉన్నారని ఆశ్రయానికి ఇంచార్జిగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థి ఖవాజా ఇత్రత్ తెలిపారు. తమ ఆశ్రయానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది డెహ్రాడూన్ నుంచి వచ్చిన వారే ఉన్నారని చెప్పారు. అంబాలాలోని మహారుషి మార్కండేశ్వర్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి రెండు రోజులపాటు బిక్కుబిక్కుమంటూ హాస్టల్‌లో తలదాచుకొని కశ్మీర్ విద్యార్థి సంఘం సందేశం మేరకు చండీగఢ్ చేరుకున్నానని చెప్పారు. తన తోటి విద్యార్థులే ఓ కశ్మీరి విద్యార్థిని పట్టుకొని కొడుతుంటే భయపడి పోయి వచ్చానని చెప్పారు. ఆ విద్యార్థి తన పేరును బహిర్గం చేయడానికి కూడా నిరాకరించారు.
చండీగఢ్‌లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థుల్లో సోబియా సిడికో అనే 19 ఏళ్ల మహిళ ఒక్కరే ఉన్నారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన ఆమె డెహ్రాడూన్‌లోని ‘కంబైన్డ్ పీజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్’ మూడో సంవత్సరం చదువుతున్నారు. తాను ఓ హిందు కుటుంబంలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నానని, శుక్ర, శనివారం రెండు రోజుల పాటు తనను ఇంటి యజమాని ఓ రూములో దాచి బయటి నుంచి తాళం వేసిందని చెప్పారు. శనివారం నాడు మూడు గంటల ప్రాంతంలో ఓ హిందూ సంఘానికి చెందిన కార్యకర్తలు తానుంటున్న ఇంటికి వచ్చి యజమానిని బెదిరించారని, తమ ఇంట్లో కశ్మీరి విద్యార్ధులెవరూ లేరని యజమాని చెప్పారని, ఇంతలో పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారని తెలిపారు. డెహ్రాడూన్‌లోని విద్యార్థినుల హాస్టల్ నుంచి గత మూడు రోజులుగా ఎవరూ బయటకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment