Kashmiri students
-
యోగికి ఝలక్: ఆయనను కలిసేందుకు మేం రాం!
లక్నో: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు నేపథ్యంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రయత్నించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు చుక్కెదురైంది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌కు కలిగే ప్రయోజనాలను వివరిస్తాను.. తనతో ముఖాముఖి మాట్లాడేందుకు రావాలని యోగి పంపిన ఆహ్వానాన్ని కశ్మీర్ విద్యార్థులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. యోగి ఆహ్వానం రాజకీయ స్వభావంతో ఉందని, దీనిని అంగీకరించబోమని ఏఎంయూలో చదువుతున్న కశ్మీరీ విద్యార్థులు తేల్చిచెప్పారు. యోగితో సమావేశానికి వెళ్లరాదని కశ్మీరీ విద్యార్థులు ఏకగ్రీవంగా, మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఎవరైనా వెళ్లి సీఎంను కలిస్తే.. అది వారి వ్యక్తిగత అభీష్టంగా చూడాలి కానీ, కశ్మీరీ విద్యార్థుల అభిప్రాయంగా చూడరాదని ఓ కశ్మీరీ రీసెర్చ్ స్కాలర్ చెప్పారు. యోగి ఆహ్వానం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని, అందరూ ఆనందంగా ఉన్నారని ప్రపంచానికి చూపేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని మరో కశ్మీరీ విద్యార్థి పేర్కొన్నారు. -
కశ్మీరీ విద్యార్థులపై సేన కార్యకర్తల దాడి
ముంబాయి: ఇద్దరు కశ్మీరీ విద్యార్థులపై శివసేన యూత్ వింగ్ కార్యకర్తలు బుధవారం రాత్రి దాడిచేశారు. అనంతరం దాడి చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు దాడికి పాల్పడిన 8 మంది సేన కార్యకర్తలను అరెస్ట్ చేసి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం..దాయాబాయి పటేల్ శారీరిక్ శిక్షణ్ మహావిద్యాలయకు చెందిన ఇద్దరు కశ్మీరీ విద్యార్థులు మార్కెట్ నుంచి వారు ఉంటున్న అద్దె ఇంటికి వెళ్తుండగా చింతామని నగర్ ప్రాంతం వద్ద సేన కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిపై దాడి చేసి వందేమాతరం, భారత్ మాతాకీ జై అని దేశభక్తి నిరూపించుకోవాలని బలవంతంగా నినాదాలు చేయించారు. ఆ సంఘటన నుంచి బయటపడిన అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు. ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి తమకు ముప్పు ఉందని, మేము ఇక్కడ ఒకటిన్నర సంవత్సరం నుంచి ఉంటున్నామని, కానీ ఇప్పుడు అద్దెకు ఉంటున్న గదిని నాలుగు రోజుల్లో ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టంగా ఉందని బాధితులు వాపోయారు. శివసేన యూత్ వింగ్ యువసేన ప్రెసిడెంట్ ఆదిత్యా థాక్రే ఈ దాడిని ఖండించారు. అమాయకులను అనవసరంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ దాడిలో పాల్గొన్న యువసేన కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ ఎం రాజ్‌కుమార్ మీడియాకు తెలిపారు. పుల్వామా జిల్లాలో జైష్ ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఓ వాహనంతో సీఆర్ఫీఎఫ్ జవాన్లు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో కశ్మీరీలపై చిన్న చిన్న దాడులు జరుగుతూనే ఉన్నాయి. -
మతిమాలిన దాడులు
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలయి నాలుగు రోజులు కావస్తోంది. ఈ దుండగం వెనకున్న శక్తుల పనిబట్టేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయి. అటు అమర జవాన్లకు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు జరుగుతున్నాయి. కానీ ఈ ఉదం తాన్ని ఆసరా చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిం చడం మొదలెట్టాయి. దేశభక్తి పేరుతో మతిమాలిన చర్యలకు పూనుకుని భయోత్పాతం సృష్టిస్తు న్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఇలాంటి ఉన్మత్త ధోరణులు కనబడుతున్నాయి. ఇవి ఏ స్థాయికి పోయాయంటే కశ్మీర్ విద్యార్థులను ఆదుకోవడానికి సీఆర్పీఎఫ్ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాల్సి వచ్చింది. అనేకమంది విద్యార్థులు స్వస్థలాలకు ప్రయాణం కట్టారు. ఉత్తరా ఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మూకలు హస్టళ్లలో ఉండి చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులను వేధిం చడం, దౌర్జన్యానికి దిగడం, తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీచేయడం, ఆ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలను తమ కళాశాలల్లో ఇకపై చేర్చుకోబోమని యాజమాన్యాల నుంచి అండర్‌టేకింగ్‌లు తీసుకోవడం వంటి చర్యలకు పూనుకున్నాయి. వందలమంది మూక శనివారం ఒక హాస్టల్‌పై దాడిచేస్తే అందులోని కశ్మీరీ పిల్లలు ప్రాణభయంతో ఒక గదిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారని మీడియా కథనాలు చెబుతున్నాయి. అలాగే పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) విద్యార్థిపై దుండగులు దాడిచేసి నెత్తురోడేలా కొట్టి గాయపరిచారు. పంజాబ్, హర్యానా, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో కశ్మీర్ విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. బిహార్‌లోని పట్నాలో కశ్మీరీ వ్యాపారులపై దుండగులకు దిగారు. ఇలాంటి చర్యలు పౌరుల్లో పరస్పర విద్వేషాలకు కారణమవుతాయని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఆ పిల్లలంతా తమ స్వస్థలాలను వదిలి ఉన్నత చదువుల కోసం వందల కిలోమీటర్లు దాటుకుని వచ్చింది దేనికోసం? తమ ప్రాంతంలో వేర్పాటువాదం పేరుతో దశాబ్దాల తరబడి సాగుతున్న ఉద్యమాలు, వాటి పర్యవసానంగా ఏర్పడుతున్న అస్తవ్యస్థ పరిస్థితులు... ఇటీవలి కాలంలో ఆ పేరు చెప్పి సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు వగైరాల నుంచి శాశ్వతంగా విము క్తులం కావాలని బలంగా కోరుకుని ఆ పిల్లలు వచ్చారు. ఆ కల్లోల లోయలోని పరిస్థితులు తమ బంగారు భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని, తమ జీవితాలు మెరుగుపడాలని వాంఛిస్తు న్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల యువతలా తాము కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించి, దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. దేశ సమగ్రతను, సమైక్యతను కోరుకునే వారెవరైనా ఆ యువతను నిండు హృదయంతో ఆహ్వానిస్తారు. కశ్మీరీలకు ఇతర ప్రాంతా లవారితో దృఢమైన అనుబంధం ఏర్పడుతుంది. అది అంతిమంగా దేశానికెంతో మేలు కలిగి స్తుంది. కశ్మీర్ యువత ఆలోచనాసరళికి నిజానికి బెంబేలెత్తవలసింది వేర్పాటువాద ఉద్యమ నేతలు. ఎందుకంటే ఆ ఉద్యమాలకు కశ్మీర్ ఆమోదం లేదని ప్రపంచానికి అర్ధమైందంటే వారికది నైతిక పరాజయం. ఇక ఉగ్రవాద ముఠాల సంగతి సరేసరి. దేశభక్తి ముసుగులో చెలరేగుతున్నవారికి ఇదంతా పట్టడం లేదు. తమ చర్యల ద్వారా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్‌కు వారు పరోక్షంగా తోడ్పడుతున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలవారిపై కశ్మీరీల్లో ద్వేషం రగల్చడం ఉగ్రవాద ముఠాల పథకంలోని ఆంతర్యం. ఆ పథకం పారితే కశ్మీర్‌ను విడగొట్టడం తేలికని ఆ ముఠాలు అనుకుంటున్నాయి. భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం, చదువుల కోసం వెళ్తున్న కశ్మీరీల పట్ల వివక్ష చూపుతున్నారని ప్రచారం చేస్తున్నాయి. తమ మతిమాలిన చర్యలు పరోక్షంగా వీటికి బలం చేకూరుస్తాయని మూకలు తెలుసుకోవాలి. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న శక్తులపై ఆగ్రహాన్ని అర్ధం చేసుకోవచ్చు. తమ కుటుంబాలకు దూరంగా, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య నిత్యం విధులు నిర్వరిస్తున్న జవాన్లపై అమానుషంగా దాడి చేయడం, వారి ప్రాణాలు తీయడం దేశ పౌరులందరిలోనూ ఆగ్రహావేశాలు రగిల్చింది. కానీ ఈ ఆగ్రహావేశాలు అర్ధవంతంగా ఉండాలి. అవి వర్తమాన స్థితి గతులపై, పొంచివున్న ప్రమాదాలపై పౌరుల్లో అవగాహన కలిగించి, సమష్టిగా అడుగేసే దిశగా ప్రోత్సహించాలి. దేశం మరింత పటిష్టంగా రూపొందేందుకు దోహదపడాలి. అంతేతప్ప కశ్మీర్లో ఉదంతం జరిగింది గనుక, కశ్మీరీలంతా ద్రోహులేననడం... వారిపై దాడులకు పూనుకోవడం, తరిమి కొట్టడం ఏ సంస్కృతికి సంకేతం? వారికి చదువులు చెప్పరాదని, నిలువనీడ కల్పించరాదని స్థానికులను బెదిరించడం, వారినుంచి అండర్‌టేకింగ్‌లు తీసుకోవడం ఏ విలువ లకు చిహ్నం? అసలే కశ్మీర్లో దశాబ్దాల తరబడి సాగుతున్న ఉద్యమాల వల్ల, వాటిని అదుపు చేసే క్రమంలో చోటు చేసుకుంటున్న అపశ్రుతుల వల్ల అక్కడివారిలో అపోహలు, అపార్థాలు చోటు చేసు కుంటున్నాయి. వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వాలు అవసరమైనంతగా కృషి చేయడం లేదు. ప్రజా ప్రభుత్వాలున్నా, రాష్ట్రపతి పాలనకింద మనుగడ సాగిస్తున్నా ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ ఉండటం లేదు. ఈ అనిశ్చితి నుంచి బయటపడి మెరుగైన భవిష్యత్తును వెదుక్కుంటూ వచ్చిన వారికి ఇక్కడ సైతం అలాంటి పరిస్థితులే కల్పించడం మూకల ఉద్దేశమా? కశ్మీరీలపై దాడులు జరగకుండా చూడాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమీయాలని కేంద్రం అన్ని రాష్ట్రా లనూ కోరింది. అయినా ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏదో ఒక సాకుతో తరచు ఇలా మూకలు చెలరేగడం, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఇదంతా అంతిమంగా ప్రపంచ దేశాల్లో మన పరువుప్రతిష్టల్ని దిగజారుస్తుంది. ప్రభు త్వాలు ఇప్పటికైనా కదిలి తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. -
బిక్కుబిక్కుమంటున్న కశ్మీర్ విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టు దాడికి ప్రతీకారంగా కశ్మీర్ వీధులు తగులబడి పోతుంటే మరోపక్క దేశంలోని పలు ప్రాంతాల్లో కశ్మీర్ విద్యార్థులు లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, హర్యానాలోని అంబాలా, రాజస్థాన్‌లోని జైపూర్, బీహార్‌లోని పట్నా నగరాల్లో కశ్మీర్ విద్యార్థులు లక్ష్యంగా కళాశాలలు, హాస్టళ్లు, అద్దె ఇళ్లు లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఈ దాడులు నేటికి కొనసాగుతున్నాయి. కశ్మీరు విద్యార్థులకు ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులు దాడులకు భయపడి వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని చోట్ల కశ్మీరు విద్యార్థుల సామాన్లను బయటపడేసి నిర్దాక్షిణ్యంగా తలుపులు వేసుకుంటున్నారు. కొంత మంది మానవతావాదులు మాత్రం కశ్మీర్ విద్యార్థులున్న రూములకు బయట నుంచి తాళాలు వేసి తమ ఇంట్లో కశ్మీరీ విద్యార్థులు లేరంటూ వారిని రక్షించేందకు ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఆపదలో ఉన్న విద్యార్థుల గురించి ‘జమ్మూ, కశ్మీరు విద్యార్థి సంఘం’ రంగప్రవేశం చేసి వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీలైనన్ని చోట్ల రూములను అద్దెకు తీసుకొని రోడ్డున పడ్డ విద్యార్థులకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తోంది. గత రెండు రోజులుగా పచ్చి మంచినీళ్లు తప్ప ఎలాంటి ఆహారం లేకుండా చీకటి గదుల్లో తలదాచుకున్నామంటూ కొంత మంది విద్యార్థులు తమ గాధలను మీడియాకు వివరిస్తుంటే, ఇలాంటి కష్టాలు తమకు కొత్త కాదని, మున్ముందు తమ చదువులు కొనసాగుతాయా, లేదా ? భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలు వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని అల్పైన్ కళాశాలలో రసాయన శాస్త్రంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇంతియాజ్ అహ్మద్ మీర్, మరో 29 మంది విద్యార్థులు దాడులకు భయపడి చండీగఢ్ చేరుకున్నారు. అక్కడ వారికి కశ్మీర్ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆశ్రయం పొందారు. ఢిల్లీలోని మెడికల్ సైన్సెస్ అండ్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జావెద్ అక్తర్ స్వగ్రామమైన కుప్పారలోని లోలబ్కు తిరిగి వస్తూ మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. ఆయన కూడా ప్రస్తుతం చండీగఢ్ శిబిరంలో ఆశ్రయం తీసుకున్నారు. కత్తులు, కర్రల ధరించి దాదాపు 40 మంది తమ కాలేజీ వద్దకు వచ్చి తమను బెదిరించారని, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, కళాశాలల్లోగానీ, నగరంలోగానీ ఒక్క కశ్మీరీ కూడా ఉండరాదంటూ హెచ్చరికలు చేశారని మీర్ తెలిపారు. చండీగఢ్‌లో తాము ప్రస్తుతం నాలుగు ఫ్లాట్స్ తీసుకున్నామని, వాటిలో 20 రూములు ఉన్నాయని, వంద మందికి ఆశ్రయం కల్పించే అవకాశం ఉందని, అయితే మధ్యలో చిక్కుబడి చండీగఢ్‌కు చేరుకున్న కశ్మీర్ విద్యార్థులు దాదాపు వెయ్యి మంది ఉన్నారని ఆశ్రయానికి ఇంచార్జిగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థి ఖవాజా ఇత్రత్ తెలిపారు. తమ ఆశ్రయానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది డెహ్రాడూన్ నుంచి వచ్చిన వారే ఉన్నారని చెప్పారు. అంబాలాలోని మహారుషి మార్కండేశ్వర్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి రెండు రోజులపాటు బిక్కుబిక్కుమంటూ హాస్టల్లో తలదాచుకొని కశ్మీర్ విద్యార్థి సంఘం సందేశం మేరకు చండీగఢ్ చేరుకున్నానని చెప్పారు. తన తోటి విద్యార్థులే ఓ కశ్మీరి విద్యార్థిని పట్టుకొని కొడుతుంటే భయపడి పోయి వచ్చానని చెప్పారు. ఆ విద్యార్థి తన పేరును బహిర్గం చేయడానికి కూడా నిరాకరించారు. చండీగఢ్‌లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థుల్లో సోబియా సిడికో అనే 19 ఏళ్ల మహిళ ఒక్కరే ఉన్నారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన ఆమె డెహ్రాడూన్‌లోని ‘కంబైన్డ్ పీజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్’ మూడో సంవత్సరం చదువుతున్నారు. తాను ఓ హిందు కుటుంబంలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నానని, శుక్ర, శనివారం రెండు రోజుల పాటు తనను ఇంటి యజమాని ఓ రూములో దాచి బయటి నుంచి తాళం వేసిందని చెప్పారు. శనివారం నాడు మూడు గంటల ప్రాంతంలో ఓ హిందూ సంఘానికి చెందిన కార్యకర్తలు తానుంటున్న ఇంటికి వచ్చి యజమానిని బెదిరించారని, తమ ఇంట్లో కశ్మీరి విద్యార్ధులెవరూ లేరని యజమాని చెప్పారని, ఇంతలో పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారని తెలిపారు. డెహ్రాడూన్‌లోని విద్యార్థినుల హాస్టల్ నుంచి గత మూడు రోజులుగా ఎవరూ బయటకు రావడం లేదు. -
అక్కడ బీఫ్ లేదు.. వారికి బెయిల్!
జైపూర్: రాజస్థాన్‌లోని మేవాడ్ యూనివర్సిటీలో తలెత్తిన బీఫ్ వివాదం సద్దుమణుగుతోంది. యూనివర్సిటీలోని తమ హాస్టల్ గదిలో ఆవుమాంసం వండుకొని తిన్నారనే ఆరోపణలతో అరెస్టయిన నలుగురు కశ్మీరీ విద్యార్థులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ విద్యార్థులు వండుకొని తిన్న మాంసం బీఫ్ కాదని నిపుణులు నిర్ధారించడంతో చిత్తర్‌గఢ్‌లోని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వారికి బెయిల్ మంజూరు చేసింది. మేవాడ్ వర్సిటీ డిగ్రీ చదువుతున్న కశ్మీరీ విద్యార్థులు షకీబ్ అష్రఫ్, హిలాల్ ఫరుఖ్, మహమ్మద్ మక్బూల్, షౌకత్ అలీ తమ హాస్టల్ గదిలో బీఫ్ వండుకున్నారని వదంతులు రావడం క్యాంపస్‌లో ఉద్రిక్తతలు సృష్టించింది. ఈ వదంతులతో కొందరు విద్యార్థులు, స్థానికులు కలిసి వారిని చితకబాదారు. ఆ విద్యార్థులపై చర్య తీసుకోవాలని మరికొందరు యూనివర్సిటీ ముందు ఆందోళన నిర్వహించారు. మేవాడ్ యూనివర్సిటీకి 100శాతం శాఖాహార విశ్వవిద్యాలయంగా పేరొంది. ఈ నేపథ్యంలో 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సున్న ఆ నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే స్థానికంగా లభించే 300 గ్రాముల మాంసాన్ని తెచ్చుకొని.. వారు వండుకున్నారని పోలీసులు విచారణలో ధ్రువీకరించారు. అయితే, ఆ విద్యార్థులు తెచ్చుకున్న మాంసం బీఫ్ కాదని నిపుణులు తేల్చారు.