కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడికి 40మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు బలయి నాలుగు రోజులు కావస్తోంది. ఈ దుండగం వెనకున్న శక్తుల పనిబట్టేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయి. అటు అమర జవాన్లకు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు జరుగుతున్నాయి. కానీ ఈ ఉదం తాన్ని ఆసరా చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిం చడం మొదలెట్టాయి. దేశభక్తి పేరుతో మతిమాలిన చర్యలకు పూనుకుని భయోత్పాతం సృష్టిస్తు న్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఇలాంటి ఉన్మత్త ధోరణులు కనబడుతున్నాయి. ఇవి ఏ స్థాయికి పోయాయంటే కశ్మీర్ విద్యార్థులను ఆదుకోవడానికి సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాల్సి వచ్చింది. అనేకమంది విద్యార్థులు స్వస్థలాలకు ప్రయాణం కట్టారు. ఉత్తరా ఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మూకలు హస్టళ్లలో ఉండి చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులను వేధిం చడం, దౌర్జన్యానికి దిగడం, తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీచేయడం, ఆ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలను తమ కళాశాలల్లో ఇకపై చేర్చుకోబోమని యాజమాన్యాల నుంచి అండర్‌టేకింగ్‌లు తీసుకోవడం వంటి చర్యలకు పూనుకున్నాయి. వందలమంది మూక శనివారం ఒక హాస్టల్‌పై దాడిచేస్తే అందులోని కశ్మీరీ పిల్లలు ప్రాణభయంతో ఒక గదిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారని మీడియా కథనాలు చెబుతున్నాయి. అలాగే పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) విద్యార్థిపై దుండగులు దాడిచేసి నెత్తురోడేలా కొట్టి గాయపరిచారు. పంజాబ్, హర్యానా, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో కశ్మీర్ విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. బిహార్‌లోని పట్నాలో కశ్మీరీ వ్యాపారులపై దుండగులకు దిగారు. ఇలాంటి చర్యలు పౌరుల్లో పరస్పర విద్వేషాలకు కారణమవుతాయని వేరే చెప్పనవసరం లేదు.
నిజానికి ఆ పిల్లలంతా తమ స్వస్థలాలను వదిలి ఉన్నత చదువుల కోసం వందల కిలోమీటర్లు దాటుకుని వచ్చింది దేనికోసం? తమ ప్రాంతంలో వేర్పాటువాదం పేరుతో దశాబ్దాల తరబడి సాగుతున్న ఉద్యమాలు, వాటి పర్యవసానంగా ఏర్పడుతున్న అస్తవ్యస్థ పరిస్థితులు... ఇటీవలి కాలంలో ఆ పేరు చెప్పి సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు వగైరాల నుంచి శాశ్వతంగా విము క్తులం కావాలని బలంగా కోరుకుని ఆ పిల్లలు వచ్చారు. ఆ కల్లోల లోయలోని పరిస్థితులు తమ బంగారు భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని, తమ జీవితాలు మెరుగుపడాలని వాంఛిస్తు న్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల యువతలా తాము కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించి, దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. దేశ సమగ్రతను, సమైక్యతను కోరుకునే వారెవరైనా ఆ యువతను నిండు హృదయంతో ఆహ్వానిస్తారు. కశ్మీరీలకు ఇతర ప్రాంతా లవారితో దృఢమైన అనుబంధం ఏర్పడుతుంది. అది అంతిమంగా దేశానికెంతో మేలు కలిగి స్తుంది. కశ్మీర్ యువత ఆలోచనాసరళికి నిజానికి బెంబేలెత్తవలసింది వేర్పాటువాద ఉద్యమ నేతలు. ఎందుకంటే ఆ ఉద్యమాలకు కశ్మీర్ ఆమోదం లేదని ప్రపంచానికి అర్ధమైందంటే వారికది నైతిక పరాజయం. ఇక ఉగ్రవాద ముఠాల సంగతి సరేసరి.
దేశభక్తి ముసుగులో చెలరేగుతున్నవారికి ఇదంతా పట్టడం లేదు. తమ చర్యల ద్వారా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్‌కు వారు పరోక్షంగా తోడ్పడుతున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలవారిపై కశ్మీరీల్లో ద్వేషం రగల్చడం ఉగ్రవాద ముఠాల పథకంలోని ఆంతర్యం. ఆ పథకం పారితే కశ్మీర్‌ను విడగొట్టడం తేలికని ఆ ముఠాలు అనుకుంటున్నాయి. భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం, చదువుల కోసం వెళ్తున్న కశ్మీరీల పట్ల వివక్ష చూపుతున్నారని ప్రచారం చేస్తున్నాయి. తమ మతిమాలిన చర్యలు పరోక్షంగా వీటికి బలం చేకూరుస్తాయని మూకలు తెలుసుకోవాలి. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న శక్తులపై ఆగ్రహాన్ని అర్ధం చేసుకోవచ్చు. తమ కుటుంబాలకు దూరంగా, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య నిత్యం విధులు నిర్వరిస్తున్న జవాన్లపై అమానుషంగా దాడి చేయడం, వారి ప్రాణాలు తీయడం దేశ పౌరులందరిలోనూ ఆగ్రహావేశాలు రగిల్చింది. కానీ ఈ ఆగ్రహావేశాలు అర్ధవంతంగా ఉండాలి. అవి వర్తమాన స్థితి గతులపై, పొంచివున్న ప్రమాదాలపై పౌరుల్లో అవగాహన కలిగించి, సమష్టిగా అడుగేసే దిశగా ప్రోత్సహించాలి. దేశం మరింత పటిష్టంగా రూపొందేందుకు దోహదపడాలి. అంతేతప్ప కశ్మీర్‌లో ఉదంతం జరిగింది గనుక, కశ్మీరీలంతా ద్రోహులేననడం... వారిపై దాడులకు పూనుకోవడం, తరిమి కొట్టడం ఏ సంస్కృతికి సంకేతం? వారికి చదువులు చెప్పరాదని, నిలువనీడ కల్పించరాదని స్థానికులను బెదిరించడం, వారినుంచి అండర్‌టేకింగ్‌లు తీసుకోవడం ఏ విలువ లకు చిహ్నం?
అసలే కశ్మీర్‌లో దశాబ్దాల తరబడి సాగుతున్న ఉద్యమాల వల్ల, వాటిని అదుపు చేసే క్రమంలో చోటు చేసుకుంటున్న అపశ్రుతుల వల్ల అక్కడివారిలో అపోహలు, అపార్థాలు చోటు చేసు కుంటున్నాయి. వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వాలు అవసరమైనంతగా కృషి చేయడం లేదు. ప్రజా ప్రభుత్వాలున్నా, రాష్ట్రపతి పాలనకింద మనుగడ సాగిస్తున్నా ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ ఉండటం లేదు. ఈ అనిశ్చితి నుంచి బయటపడి మెరుగైన భవిష్యత్తును వెదుక్కుంటూ వచ్చిన వారికి ఇక్కడ సైతం అలాంటి పరిస్థితులే కల్పించడం మూకల ఉద్దేశమా? కశ్మీరీలపై దాడులు జరగకుండా చూడాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమీయాలని కేంద్రం అన్ని రాష్ట్రా లనూ కోరింది. అయినా ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏదో ఒక సాకుతో తరచు ఇలా మూకలు చెలరేగడం, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఇదంతా అంతిమంగా ప్రపంచ దేశాల్లో మన పరువుప్రతిష్టల్ని దిగజారుస్తుంది. ప్రభు త్వాలు ఇప్పటికైనా కదిలి తక్షణ చర్యలకు ఉపక్రమించాలి.
మతిమాలిన దాడులు
Published Tue, Feb 19 2019 12:56 AM | Last Updated on Tue, Feb 19 2019 12:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment