ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీలో మరోసారి దాడి జరిగింది. శనివారం కేజ్రీవాల్ ఒక రోడ్ షోలో ప్రసంగిస్తుండగా హఠాత్తుగా వాహనం పైకి ఎక్కిన యువకుడు ఆయనను కొట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలు వెంటనే తేరుకుని అతణ్ణి చితకబాది పోలీసులకు అప్పగించారు. అవినీతి వ్యతిరేకోద్యమం దేశంలో ఎగసిపడినప్పుడు దాని సారథ్యం వహించి నవారిలో ఒకరిగా కేజ్రీవాల్ గుర్తింపు పొందారు. అటుపై ఆయన ఆప్‌ను స్థాపించినప్పుడు ఆ ఉద్యమ సహచరుల్లో కొందరు ఆయనతో కలిసి నడిచారు. ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీవంటి మరికొందరు వ్యతిరేకించారు. 2013లో తొలిసారి ఆయన ముఖ్యమంత్రిగా స్వల్పకాలం ప్రభుత్వాన్ని నడపడం, ఆ తర్వాత 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో 67 గెల్చుకుని అధికారంలోకి రావడం చరిత్ర. అసెంబ్లీలో ఆయనకు దాదాపు ప్రత్యర్థులు లేకుండా పోయినా బయటమాత్రం అలాంటివారికి కొదవలేదు. తొలిసారి అధికారం చేపట్టినప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంటే, ఆ తర్వాత అఖండ మెజారిటీ సాధించిన సమయానికి ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎవరున్నా ఆయనకు ఘర్షణ తప్పలేదు. ముఖ్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌లుగా ఉన్నవారితో ఆయనకు నిత్యం పోట్లాటే.
ఓపక్క ఇలా రకరకాల వివాదాలు కేజ్రీవాల్‌ను చుట్టుముడుతుండగానే వాటికి సమాంతరంగా ఆయనపై ఎవరో ఒకరు దాడికి దిగడం రివాజుగా మారింది. కేజ్రీవాల్ చెబుతున్న ప్రకారం అధికారంలోకొచ్చాక ఆయనపై దాడి జరగడం ఇది తొమ్మిదోసారి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి బరిలో ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేసినప్పుడు ఆయనపై కొందరు దుండగులు దాడిచేశారు. రోడ్ షోలో మాట్లాడుతుండగా ఆయనపై కోడిగుడ్లు, ఇంకుతో దాడి జరిగింది. అదే సంవత్సరం అవినీతి వ్యతిరేకోద్యమం నాయకుడు అన్నాహజారే మద్దతుదారుడిగా చెప్పుకున్న ఒక వ్యక్తి కేజ్రీవాల్ మెడపై తీవ్రంగా కొట్టాడు. మరికొన్ని రోజులకు ఢిల్లీలో ఒక ఆటో డ్రైవర్ ఆయన చెంపపై కొట్టాడు. 2016లో ఢిల్లీలో రెండుసార్లు, పంజాబ్‌లోని లూథియానాలో ఒకసారి దుండ గులు దాడి చేశారు. ఢిల్లీలో ఒక దుండగుడు ఇంకు జల్లితే, మరికొన్ని రోజులకు మరొకడు బూటు విసిరాడు. లూథియానాలో కర్రలు, ఇనుపరాడ్‌లతో దాడిచేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. రెండేళ్లక్రితం అభిమానిగా చెప్పుకున్న యువకుడు కాళ్లపై పడినట్టు నటిస్తూనే హఠాత్తుగా ఆయన మొహంపై కారం పొడి చల్లాడు. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిపై ఇన్నిసార్లు దాడులు జరగడం విస్మయం కలిగిస్తుంది. దేశంలో మరే ముఖ్యమంత్రికీ ఈ పరిస్థితి ఏర్పడి ఉండదు.
ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వాల మౌలిక బాధ్యతల్లో ఒకటి. అది సాధారణమైన దాడి కావొచ్చు... ప్రాణాంతకమైన దాడి కావొచ్చు– భౌతికదాడి జరిగిందంటే శాంతిభద్రతల విభాగం దాన్ని సీరియస్‌గా తీసుకుంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రిపైనే పదే పదే దాడులు జరగడం, ఎప్ప టికప్పుడు అవి పరస్పరం ఆరోపణలు చేసుకునే సందర్భాలుగా మారడం ఆశ్చర్యకరం. జనంలో సానుభూతి సంపాదించుకోవడం కోసం కేజ్రీవాల్ స్వయంగా ఈ దాడుల నాటకం ఆడుతున్నారని ప్రతిసారీ బీజేపీ ఆరోపిస్తుంటే... తనను భౌతికంగా అంతమొందించడం కోసం ఆ పార్టీ ప్రయ త్నిస్తున్నదని, అందుకే దాడులు చేయిస్తున్నదని కేజ్రీవాల్ అంటారు. తాజా దాడి అనంతరం ఆయన ఇంకో అడుగు ముందుకేశారు. నరేంద్రమోదీయే ఈ దాడి చేయించారని ఆరోపించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో మోదీకి సన్నిహితసంబంధాలున్నాయని తాను అన్న తర్వాతే ఈ దాడి జరిగిందని ఆయన గుర్తుచేస్తున్నారు.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతలా ఉంచి రివాజుగా మారిన ఈ దాడులు తమ పరువు తీస్తున్నాయని, తమ సమర్థతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఢిల్లీ పోలీసులు గుర్తించిన దాఖలా కనబడటం లేదు. మొదటిసారి జరిగితే భద్రతాలోపం అని ఎవరైనా సరిపెట్టుకుంటారు. ఏకంగా తొమ్మిదిసార్లు జరగడమంటే సాధారణ విషయంగా తీసుకోలేరు. ఢిల్లీ దేశ రాజధాని నగరం కూడా కనుక అక్కడి పోలీసు విభాగం, గూఢచార విభాగం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండవు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖే ఆ బాధ్యతలు చూసుకుంటుంది. అందువల్ల అక్కడి శాంతిభద్రతల పరిరక్షణ, ముఖ్యమంత్రితోసహా కీలక నేతల భద్రత దాని అధీనంలోనే ఉంటాయి. ఈ కారణాలవల్ల కేజ్రీ వాల్‌పై జరుగుతున్న దాడుల్ని అంతిమంగా కేంద్ర వైఫల్యంగానే అందరూ పరిగణిస్తారు. ఒక ముఖ్యమంత్రినే కాపాడే స్థితి లేనప్పుడు సామాన్యుల ప్రాణాలను ఎలా పరిరక్షించగలరని ప్రశ్నిస్తారు.
ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి హోదా ఇవ్వాలని కేజ్రీవాల్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో దాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తున్నారు. సహ జంగానే తన డిమాండ్‌ను బలపరచుకోవడానికి ఈ వరస దాడుల్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ భద్రతకు 50మంది భద్రతాసిబ్బందిని నియమించారు. రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. నిజానికి ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. దాడికి కారకుడైన వ్యక్తి ఆప్ కార్యకర్తేనని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కొందరు ఆప్ నేతలు సైన్యాన్ని దూషించడమే అతని ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా అనిపించదు. ఏదేమైనా బాధ్యతగా మెలగవలసిన నాయకులు ప్రత్యర్థులను కించపరుస్తూ మాట్లాడటం, విద్వేషాన్ని వెళ్లగక్కడం ఇలా దాడులు చేసే వాతావరణానికి దోహదపడుతోంది. సాఫీగా, ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఇది ప్రమాదకరం. ఎదుటివారిపై విమర్శలకు దిగేటపుడు సంయమనం పాటించడం, నాగరిక భాష మాట్లాడటం ప్రజాస్వామ్య సంస్కృతికి దోహదపడు తుందని అన్ని పార్టీల నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment