సాక్షాత్తూ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఓ మహిళపై దాడి జరుగుతుందని ఊహించగలమా? అదీ స్వయంగా సీఎంకు కుడిభుజం లాంటి సహాయకుడే ఆ దురాగతానికి పాల్పడ్డాడంటే నమ్మగలమా? అందులోనూ తనపై అలా దాడి జరిగిందని ఆరోపిస్తున్న వ్యక్తి అధికార పార్టీకే చెందిన పార్లమెంట్ సభ్యురాలు కూడా అయితే, అవాక్కవకుండా ఉండగలమా? ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్)కి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ సొంత పార్టీ వారిపైనే గత వారంగా చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నది అందుకే.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళితే ఆయన పీఏ విభవ్ కుమార్ అమానవీయంగా దాడి చేసి, కొట్టరాని చోటల్లా కొట్టి బయటకు గెంటించారన్న ఆరోపణలు ఏ రకంగా చూసినా అసాధారణమైనవే. అందులోనూ ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అరెస్టయిన కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన వెసులుబాటు ఆసరాగా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చీ రాగానే ఈ పరిణామం సంభవించడం ఆయననూ, ఆయన పార్టీనీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విభవ్ అరెస్ట్, స్వాతి కథను బీజేపీ రాజకీయం చేస్తోందంటూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఆప్ యత్నాలతో వ్యవహారం మరింత ముదిరింది.
కేజ్రీవాల్‌కు విభవ్ నమ్మినబంటు. పార్టీ విస్తరణ సహా అనేక బాధ్యతలను అతనికి అప్పగించారు. కేజ్రీవాల్ ఇంటిలోని క్యాంప్ ఆఫీస్ మొదలు ఢిల్లీ సెక్రటేరియట్‌లోని సీఎం ఆఫీస్ వ్యవహారాల దాకా రోజువారీ కార్యకలాపాలన్నీ అతని చేతుల మీదే నడుస్తుంటాయి. ఈ క్రమంలో స్వాతికీ, అతనికీ మధ్య గతంలో ఏం జరిగింది, దాడి ఘటన రోజున అసలేమైంది లాంటి అనేక ప్రశ్నలకింకా స్పష్టమైన సమాధానాలు దొరకాల్సి ఉంది. ఆరోపణలు వచ్చిన మొదట్లో పెదవి విప్పకుండా ‘ఆప్’ ఆలసించింది.
ఆనక స్వాతిపై దాడి జరిగిందని గతవారం అంగీకరించింది. తీరా ఇప్పుడేమో ఇదంతా రాజకీయ కుట్రంటోంది. అదీ విడ్డూరం. అలాగని స్వాతి గత చరిత్ర సైతం గొప్పదేమీ కాదు. గతంలో ఢిల్లీ మహిళా కమిషన్‌కు సారథ్యం వహించిన ఆమె ఆ పదవిలో ఉండగా నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు నిందలొచ్చాయి. ఆ వ్యవహారంలో అరెస్టు తప్పదంటూ కాషాయపార్టీ బ్లాక్‌మెయిల్ చేసిందంటున్నారు. ఆ భయంతోనే ఆమె ఈ దాడి కథ వినిపిస్తోందనేది ‘ఆప్’ వాదన.
నిజానికి, స్వాతి కూడా కేజ్రీవాల్‌కు సన్నిహితురాలే. ఆమె రాజకీయంగా ఎదిగి, రాజ్యసభ సభ్యురాలు కావడమే అందుకు ఉదాహరణ. మరి ఎక్కడ కథ అడ్డం తిరిగిందన్నది ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది. దాడి జరిగిందని చెప్పిన స్వాతి పోలీసు ఫిర్యాదుకు ఆలస్యం చేయడం, తీరా దర్యాప్తు మొదలయ్యాక రోజుకో రకం వీడియోలు, కథనాలు బయటకు రావడం చూస్తుంటే, విషయం పైకి కనిపిస్తున్నంత పారదర్శకంగా లేదన్న అనుమానమూ వస్తోంది.
పోలీసులు నిష్పాక్షికంగా, లోతైన దర్యాప్తు చేసి, నిజాలు నిగ్గుతేల్చాలి. అనుమానాలు ఏమైనా, కారణాలు ఎలాంటివైనా ఒక మహిళపై భౌతిక దాడికి దిగి గాయపరచడం, దుర్భాషలాడడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. అలాగే, ఈ కేసులో సాక్షాత్తూ సీఎం ఇంటిలోని సీసీటీవీ దృశ్యాలు సహా సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రయత్నం జరిగిందంటూ వస్తున్న వార్తలు సైతం పాలక వ్యవస్థపై సామాన్య ప్రజల నమ్మకానికి గొడ్డలిపెట్టు.
మరోపక్క విదేశాల నుంచి విరాళాలపై నిషేధం ఉన్నప్పటికీ ‘ఆప్’కు విదేశీ నిధులు వచ్చాయనీ, దాతల పేర్లను ఆ పార్టీ మరుగున పెట్టిందనీ, విదేశీమారకద్రవ్య నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనల్ని ఉల్లంఘించిందనీ తాజా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమాచారం అందించినట్లు సోమవారం బయటకొచ్చిన వార్తలు కేజ్రీవాల్‌నూ, ఆయన పార్టీనీ మరింత ఇరుకునపెట్టేవే.
పైగా, దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇలా ఒకదాని వెంట మరొకటిగా వివాదాలు రేగి, వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిలోకి నెట్టడం ఏ రాజకీయ పార్టీ విశ్వసనీయతకైనా ఇబ్బంది తెస్తాయి. తాజా పరిణామాలు ‘ఆప్’నే కాక, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని సైతం ఇరుకున పెట్టాయి. మద్యం పాలసీ మొదలు స్వాతి ఆరోపణలు, తాజా ఈడీ వెల్లడింపు వార్తల దాకా వేటి మీదా కాంగ్రెస్ సహా కూటమి పార్టీలేవీ గొంతు విప్పట్లేదు. తమ వైఖరి చెప్పట్లేదు. దేశంలో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసి, మోదీని గద్దె దించడానికి తగిన సమయమని భావిస్తున్న వేళ ఇది ఆ పార్టీలేవీ ఊహించని దుఃస్థితి.
‘ఆప్’, బీజేపీల మాటల యుద్ధం మాత్రం రాజకీయ వాతావరణాన్ని రోజురోజుకూ వేడెక్కిస్తోంది. అయితే, ఈ నెల 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ... ఈ వరుస వివాదాలు ఆకస్మికమనీ, పూర్తి యాదృచ్ఛికమనీ అనుకోవడం అమాయకత్వమే. నిజాయతీకి తాము నిలువుటద్దమని ‘ఆప్’, అలాగే అవినీతి చీడను తాము ఏరేస్తున్నామని బీజేపీ... దేనికది డప్పు కొట్టుకుంటున్నా, వాస్తవాలు అందుకు దూరంగా ఉన్నాయని ప్రజలకు అర్థమవుతూనే ఉంది.
బీజేపీ రాజకీయ ప్రతీకారాన్ని బయటపెడతామంటూ కేజ్రీవాల్ గర్జిస్తున్నా, అది ప్రతిధ్వనిస్తున్న దాఖలాలు పెద్దగా కనబడట్లేదు. పదమూడేళ్ళ క్రితం 2011లో అవినీతిపై అన్నాహజారే ఉద్యమం నుంచి ఊపిరిపోసుకున్న ‘ఆప్’ ఇవాళ లక్ష్యం మరిచి, దారి తప్పిన బాటసారిగా మారిపోవడం సమకాలీన చారిత్రక విషాదం. హజారే ఉద్యమంలో బాసటగా నిలిచిన స్పూర్తిదాయకమైన స్వతంత్ర వ్యక్తులు ఇవాళ ‘ఆప్’లో లేకపోవడం, కేజ్రీవాల్ భజనపరులదే పార్టీలో రాజ్యం కావడం లాంటివే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. స్వాతి ఆరోపణల పర్వంలో లోతుపాతులు ఏమైనా, ‘ఆప్’ ప్రస్థానంలో లోటుపాట్లు అనేకం. తప్పులు దిద్దుకొని, నిజాయతీ నిరూపించుకోవడమే ప్రజాక్షేత్రంలో శ్రీరామరక్ష.
నిజాయతీ నిరూపించుకోండి!
Published Tue, May 21 2024 4:24 AM | Last Updated on Tue, May 21 2024 4:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment