ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్‌ సంచలన ఆరోపణలు | Slapped Me Kicked In Chest Stomach: Swati Maliwal In FIR against Bibhav | Sakshi
Sakshi News home page

ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్‌ సంచలన ఆరోపణలు

Published Fri, May 17 2024 2:24 PM | Last Updated on Fri, May 17 2024 3:18 PM

Slapped Me Kicked In Chest Stomach: Swati Maliwal In FIR  against Bibhav

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తాజాగా స్వాతి  మలీవాల్‌ ఆరోపించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్‌ రూమ్‌లో ఉన్న కుమార్‌ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఛాతిపై తన్నాడని, లాగి పడేసినట్లు ఆమె ఆరోపించారు. ఆసమయంలో కేజ్రీవాల్‌ ఇంట్లోనే ఉన్నారని  పేర్కొన్నారు.

కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేశారని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన ఉదంతం తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఈ విషయంలో స్వాతి మలీవాల్‌ పోలీసులకు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిభవ్‌ కుమార్‌ను నిందితుడిగా పేర్కొంటూ గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు.

పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆమె వాంగ్మూలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. సివిల్‌ లైన్స్‌లోని మలివాల్ సోమవారం సాయంత్ర ఆరు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా. ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం డ్రాయింగ్‌ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో బిభవ్ కుమార్ గదిలోకి చొరబడి తనను దూషించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు.

‘కుమార్‌ నా ముఖంపై ఏడు,ఎనిమిది సార్లు కొట్టాడు. ‘నన్ను వెళ్లనివ్వండి’ అని చెప్పినప్పటికీ ఆయన వదలకుండా ఛాతీ, పొట్ట, సున్నితమైన భాగాలపై పలుమార్లు కొట్టాడు.  హిందీలో దుర్భాషలాడాడు. 'నీ సంగతి చూస్తాం’ అంటూ బెదిరించాడు. కడుపులో నొప్పి వస్తుందని, నన్ను వదిలేయాలని వేడుకున్నాను.

బిభవ్‌ చర్యలతో పూర్తిగా షాక్‌కు గురయ్యాను. సహయం కోసం గట్టిగా అరిచాను. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని కాలితో తన్ని దూరంగా నెట్టేశాను. నేను బయటక పరుగెడుతుంటే నాపైకి దూసుకొచ్చాడు. నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. ఛాతీ, కడుపు వంటి సున్నితమైన శరీరభాగాలపై పలుమార్లు దాడి చేశాడు.  పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశా’’ అని స్వాతి మలీవాల్వె‌ ల్లడించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై మలీవాల్‌  గురువారం తొలిసారి స్పందిస్తూ.. ఈ దాడితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురయ్యాను పేర్కొన్నారు. 112 నంబర్‌కు కాల్ చేసి సంఘటనను నివేదించానని చెప్పారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని  విజ్ఞప్తి చేశారు. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement