
ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ప్రభుత్వ అప్పటి ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడిచేసిన కేసులో ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర 9 మంది ఇతర ఎమ్మెల్యేలను ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2018 నాటి ఈ కేసులో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అయితే, ఈ కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమాంతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాల్‌పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా తీర్పుపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు.ఇది తప్పుడు కేసు అని మొదటినుంచీ చెబుతూనే ఉన్నామనీ, ఈ కేసులో అన్ని ఆరోపణలు అబద్ధమని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. సత్యానికి, న్యాయానికి లభించిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. తమ సీఎంకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని సిసోడియా వ్యాఖ్యానించారు.
కాగా 2018 ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో అప్పటి సీఎస్ ప్రకాష్‌పై ఎమ్మెల్యేలు దాడి చేశారనే ప్రధాన ఆరోపణతో కేసునమోదైంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఛార్జిషీటు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment