క్లోరిన్ గ్యాస్ లీక్.. 24 మందికి అస్వస్థత
డెహ్రాడూన్: క్లోరిన్ గ్యాస్ లీకైన ఘటనలో చిన్నారులు, పోలీసులు సహా మొత్తం 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నగరంలోని జల సంస్థాన్ మంచినీటి శుద్ధీకరణ కేంద్రంలో గురువారం రాత్రి క్లోరిన్ గ్యాస్ లీకైంది. దీంతో వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రభావానికి లోనయ్యారు.
ఆక్సిజన్ కొరత: క్లోరిన్ వాయువును పీల్చి అస్వస్థతకు గురైనవారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆక్సిజన్ కొరత ఉండటంతో బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
సీఎం ట్వీట్: గ్యాస్ లీకేజీ ఘటన గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నానని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి గ్యాస్ లీకేజీ లేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నానని శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.