
రోజూ ఉదయం తొమ్మిదిన్నర అయితే చాలు ఆ పోలీస్ స్టేషన్‌కు స్కూల్ బ్యాగులతో పిల్లలు క్యూ కడతారు. మధ్యాహ్నం మూడున్నర వరకు అక్కడే ఉండి పాఠాలు వల్లె వేస్తారు. కొంతమంది పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తూనే ఖాళీసమయాల్లో వారికి పాఠాలు చెబుతారు..పోలీస్‌స్టేషన్ ఏంటి? పాఠాలేంటి? అనుకుంటున్నారా? డెహ్రాడూన్‌లోని ప్రేమ్‌నగర్‌లో ఓ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్‌స్టేషన్ ఆవరణలో కొంతకాలంగా ఓ పాఠశాల నిర్వహిస్తున్నారు. మొదట ఈ పాఠశాలను ప్రారంభించినప్పుడు పది మంది మాత్రమే విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం 4–12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 51 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ మిగతా పాఠశాలల తరహాలో బట్టీ పట్టడాలు, మార్కుల వేటలు ఉండవు. హిందీ, ఇంగ్లిష్, గణితం నేర్పుతారు. చదవడం వచ్చిన వారికి చరిత్ర, భౌగోళిక శాస్త్రం కూడా నేర్పుతారు.
ముందుకొస్తున్న దాతలు
పోలీసుల రక్షణలోనే పాఠశాల ఉండటంతో ఈ పాఠశాలకు పంపేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు కొంతమంది అవసరమైన సాయం అందించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థులను తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు వ్యాన్ కోసం ఓ వ్యక్తి నెలకు రూ.5,000 ఇచ్చేందుకు అంగీకరించారు. మరొకరు ఉచితంగా బ్యాగులు ఇచ్చారు. ఈ స్కూల్‌కు వచ్చే పిల్లలకు అరటిపళ్లు, సమోసా వంటి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని దాతలు అందజేస్తున్నారు.
నందాకీ చౌకీ స్లమ్‌లో నివసించే బడిఈడు పిల్లల కోసం ఆసరా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదట ఈ పాఠశాలను పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని చక్రతా రోడ్డు పక్కన నడిపేవారు. ఎప్పుడూ ట్రాఫిక్‌తో ఈ రోడ్డు బిజీగా ఉండటంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగేది. ఇది గమనించిన ప్రేమ్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేశ్ త్యాగి పాఠశాలను పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగితే ఒక్కో సెషన్ రెండు గంటల చొప్పున మూడు సెషన్స్ నిర్వహిస్తామని ఆసరా ట్రస్ట్‌కు చెందిన రాఖీ వర్మ తెలిపారు. ‘మా నాన్న చిత్తు కాగితాలు ఏరుతారు..నేను అడుక్కుంటూ కుటుంబానికి సాయం చేస్తాను...ఇప్పుడు ఈ స్కూల్‌కి వెళ్లి హాయిగా చదువుకుంటున్నాను’ అని గాయత్రి అనే విద్యార్థిని సంతోషం వ్యక్తం చేసింది. ఒక్క గాయత్రే కాదు.. ఎప్పుడూ పాఠశాల గడప తొక్కని పలువురు ఇక్కడ హాయిగా చదువుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment