విజయవాడ స్పోర్ట్స్ : ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఈ నెల 13వ తేదీన నటి జత్వాని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే విద్యాసాగర్‌పై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశామన్నారు.
ఆ వెంటనే అతడి కోసం ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. డెహ్రాడూన్‌లో ప్రత్యేక బృందాలు అతన్ని పట్టుకున్నాయని, ఈ నెల 20న అరెస్ట్ చేసి.. డెహ్రాడూన్ మూడో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచాయన్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అంతా రివర్స్: సినీ నటి కాదంబరి జత్వాని తనను మోసం చేసిందని తొలుత కేసు పెట్టిందే కుక్కల విద్యాసాగర్. ఆమె ఫోన్లు వెనక్కు ఇవ్వద్దని, అలా ఇస్తే డేటా తొలగిస్తారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, పోరాడుతున్నది కూడా ఇతనే. పోర్జరీ సంతకాలతో భూమిని కొట్టేసేందుకు యత్నించిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదుతో జత్వానిపై కేసు నమోదు చేసి.. ముంబై నుంచి ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు.
ఇలా ఎంతో మందిని ఆమె మోసగించిందని విచారణలో తేలింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీడీపీ పెద్దలు ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు దిగారు. ముగ్గురిని సస్పెండ్ కూడా చేశారు. కేసును తిమ్మినిబమ్మి చేసి తమ కక్ష సాధింపునకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే కుక్కల విద్యాసాగర్‌పై ఆమెతో ఉల్టా కేసు పెట్టించి, అరెస్ట్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై ఇలా కక్ష సాధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment