జప్తు చేసిన వాటన్నింటినీ ఒరిజినల్ రూపంలోనే భద్రపరచండి
కుక్కల విద్యాసాగర్ పిటిషన్‌పై పోలీసులను ఆదేశించిన హైకోర్టు
వారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
కోర్టుకు హాజరైన జత్వానీ, ఆమె తల్లిదండ్రులు
అక్టోబర్ 1వ తేదీకి విచారణ వాయిదా
సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను భద్రపరిచే విషయంలో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, లాప్‌ట్యాప్‌లను, అందులో ఉన్న డేటాను ఒరిజినల్ రూపంలోనే భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. ఉపకరణాలంటే అందులో ఉన్న డేటా కూడా అని, దానిని కూడా భద్రపరచడం తప్పనిసరని తెలిపింది.
డేటా అత్యంత కీలకమంది. తన ఫిర్యాదు మేరకు జత్వానీ తదితరులపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఆమెకు చెందిన పలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను జప్తు చేశారని, అందులో కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జత్వానీ నుంచి జప్తు చేసిన ఉపకరణాలన్నింటినీ భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మరోసారి విచారణ జరిపారు.
వెనక్కి ఇచ్చేసేందుకే వాటిని తెప్పించారు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు ఇతర ఉపకరణాలను ఆమెకు తిరిగి ఇచ్చే ఉద్దేశం ఏమీ ప్రస్తుతానికి దర్యాప్తు అధికారికి లేదని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) వద్ద ఉన్న జత్వానీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తిరిగి ఆమెకు ఇచ్చేస్తున్నారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అసలు ఆ ఉపకరణాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.
పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి వద్ద ఉన్నాయని దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఈ సమయంలో విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, ఎఫ్‌ఎస్‌ఎల్ వద్ద విశ్లేషణ నిమిత్తం ఉన్న జత్వానీ మొబైల్ ఫోన్లు తదితర ఉపకరణాలను వెనక్కు ఇచ్చేందుకు హడావుడిగా తెప్పించారని తెలిపారు. ఆ ఉపకరణాలను విశ్లేషించి, అందులో ఉన్న వివరాలతో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందచేయాల్సి ఉంటుందన్నారు.
మొబైల్ ఫోన్లు జప్తు చేసిన నేపథ్యంలో, అందులో ఉన్న సిమ్ కార్డ్ స్థానంలో తాజా సిమ్ కార్డ్‌ను జత్వానీకి ఇవ్వాలని సంబంధిత ఆపరేటర్‌ను పోలీసులు ఆదేశించే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే ఆ సిమ్‌లో ఉన్న డేటా మొత్తం పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు గురించి జత్వానీ ఇష్టమొచ్చినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్‌డీటీవీకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలను ఆయన కోర్టుకు సమర్పించారు.
ఈ సమయంలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఆ ఉపకరణాలను వెనక్కి ఇచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని పునరుద్ఘాటించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ మొత్తం వ్యవహారంలో వారం కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు జత్వానీ, ఆమె తల్లిదండ్రులు కోర్టులో హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment