విధుల్లో భాగంగా తీసుకున్న చర్యలకు నేరాన్ని ఎలా ఆపాదిస్తారు?
టాటా, గున్నీ తదితరులపై కేసుల వెనుక దురుద్దేశాలున్నాయి
హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాదులు
సాక్షి, అమరావతి: డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే వివరించారు.
జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు.
విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచి్చన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?
జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు. అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఈ నెల 19కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment