జత్వానీ కేసు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు
ఆమె నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలు ఎక్కడ?
వాటిని భద్రపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి
విచారణ ఈ నెల 17కి వాయిదా
సాక్షి, అమరావతి: సినీనటి కాదంబరి జత్వానీకి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగానే.. దాని గురించి మీడియా ముందు ఎలా మాట్లాడతారని ఆమె తరఫు న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. అలా మాట్లాడటం ఎంత మాత్రం సమంజసం కాదంది. న్యాయవాదిగా అన్నీ తెలిసి కూడా కేసు పూర్వాపరాల గురించి మాట్లాడటం సహేతుకం కాదని తేల్చి చెప్పింది. ఇకపై ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దంది.
ఆ కేసు గురించి ఎవరు చర్చ మొదలు పెట్టారో, ఎవరు దానిని కొనసాగిస్తున్నారో తమకు తెలుసునంది. జత్వానీకి చెందిన మొబైల్ ఫోన్లు, ఐ పాడ్, ల్యాప్‌టాప్ తదితర ఉపకరణాలు ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. అలాగే వాటిని భద్రపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియచేయాలంది. ఈ వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సినీనటి కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ, ఆమె తల్లి తనను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి తన నుంచి భారీ మొత్తం వసూలు చేశారంటూ కుక్కల విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు, జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఇతర ఉపకరణాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.
మొబైల్, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారం..
బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్ ఫోన్లు, ఐ పాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారం ఉందన్నారు. అందులో ఉన్న సమాచారాన్ని వెలికి తీసేందుకు అవన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరి (ఎఫ్‌సీఎల్) వద్ద ఉన్నాయని తెలిపారు. అయితే పోలీసులు ఇప్పుడు వాటిని వెనక్కి తెప్పించి జత్వానీకి ఇచ్చేయనున్నారని తెలిపారు. కోర్టు ప్రమేయం లేకుండా ఇలా చేయడానికి వీల్లేదని తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.
అలాంటి ఆదేశాలు హైకోర్టు ఇవ్వలేదు...
జత్వానీ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదిగా చేరుతామని, ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. జత్వానీ నుంచి జప్తు చేసిన ఫోన్లు ఇతర ఉపకరణాలను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, అవన్నీ కూడా కేసుతో ముడిపడి ఉన్న ఉపకరణాలని, వాటిని వెనక్కి ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది సంబంధిత మేజిస్ట్రేట్ మాత్రమేనని చెప్పారు. ఇందులో హైకోర్టు ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమన్నారు.
‘బిగ్‌బాస్ షో’పై తీర్పు వాయిదా
సాక్షి, అమరావతి: అశ్లీలత, అసభ్యత, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహించడంతో పాటు యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment