ఆ శిక్ష.. ఐపీఎస్‌లపై కక్ష! | The state government is harassing officials with illegal cases | Sakshi
Sakshi News home page

ఆ శిక్ష.. ఐపీఎస్‌లపై కక్ష!

Published Wed, Sep 18 2024 4:36 AM | Last Updated on Wed, Sep 18 2024 8:54 AM

The state government is harassing officials with illegal cases

అసలు కారణం బాబు అరెస్టే..

అధికారులను అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

హనీ ట్రాప్, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జత్వానీకి వత్తాసు

ఆగమేఘాలపై ఆమెను రప్పించి ఫిర్యాదు స్వీకరణ

ఎలాంటి విచారణ లేకుండానే అక్రమ కేసు నమోదు

ఆ వెంటనే ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌

వారిపై మరిన్ని చర్యలకు పన్నాగం

మార్గదర్శి పని పట్టిన ఐఆర్‌ఎస్‌ అధికారి రామకృష్ణపై తాజాగా ఈనాడు ఆగ్రహం 

రామోజీ కుటుంబ మేలు కోసం ఆ అధికారిని టార్గెట్‌ చేసిన ప్రభుత్వం

అందుకే కక్షగట్టి వేధింపుల కుతంత్రం

ప్రభుత్వ కక్షపై మండిపడుతున్న అఖిల భారత సర్వీసు అధికారులు

సాక్షి, అమరావతి:  వలపు వల (హనీ ట్రాప్‌)తో బడా బాబులను బ్లాక్‌ మెయిల్‌ చేయడం ఆమె వ్యవహార శైలి.. ఫోర్జరీ పత్రాలతో మోసాలకు పాల్పడటం ఆమె నైజం..ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో కేసులు ఆమె నేర చరిత్రకు సాక్ష్యం..ఫోర్జరీ నేరంపై విజయవాడ కోర్టు ఆదేశాలతో రిమాండ్‌.. ఇదీ ఇటీవల నేపథ్యం.. తీవ్రమైన నేరాల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ నిరాధార ఆరోపణలతో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై ఫిర్యాదు చేస్తే, ప్రభుత్వం ఎలా స్పందించాలి? ఆమెను అరెస్ట్‌ చేసి, న్యాయస్థానం ద్వారా రిమాండ్‌ విధించిన అధికారులపై ఆరోపణలు చేస్తున్నట్టుగా భావించాలి. 

మరోవైపు ఆమె ఆరోపణలు ఎంత వరకు వాస్తవమో దర్యాప్తునకు ఆదేశించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని మనసులో ఉంచుకున్న చంద్రబాబు.. ఏదో ఒక సాకు చూపి.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై వేటు వేయాలని ఎదురు చూస్తున్నారు.  ఇందులో భాగంగానే జుగుప్సాకరమైన, తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీకి ప్రభుత్వం విశిష్ట అతిథి స్థాయిలో ప్రోటోకాల్‌ మర్యాదలు చేసింది. 

ఆపై ఆమె ఫిర్యాదును సాకుగా చేసుకుని డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఐజీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్‌ గున్నీలను ఏకపక్షంగా సస్పెండ్‌ చేసింది. వారిపై మరిన్ని చర్యలకు సన్నద్ధమవుతోంది. ఈ పరిణామం యావత్‌ దేశ వ్యాప్తంగా అఖిల భారత సర్వీసు అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు తనను అరెస్ట్‌ చేయడాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై.. అదీ ఏకంగా డీజీ స్థాయి, ఐజీ, డీఐజీ స్థాయి అధికారులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. 

వ్యక్తిగత కక్షతోనే ఈ ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై ప్రభుత్వం రెడ్‌ బుక్‌ రాజ్యాంగం మేరకు కుట్ర పూరితంగా కక్ష సాధింపునకు పాల్పడుతోంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులతో వేధిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. కీలక ఉన్నతాధికారులే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతోంది.  

కాదంబరితో క్విడ్‌ ప్రో కో కుట్ర
వలపు వల (హనీట్రాప్‌)తో బడా బాబులను బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడటమే వ్యాపకంగా మార్చుకున్న కాదంబరి జత్వానీతో కూడా చంద్రబాబు ప్రభుత్వం క్విడ్‌ ప్రో కో కుట్రకు తెరతీసింది. ఫోర్జరీ పత్రాలతో భూములు కొల్లగొట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన ఆమెతో టీడీపీ ప్రభుత్వం అవగాహనకు రావడం విడ్డూరంగా ఉంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితురాలికి వత్తాసు పలుకుతూ ఐపీఎస్‌ అధికారులను వేధిస్తుండటం పట్ల అఖిల భారత సర్వీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

నేర చరిత్ర ఉన్న కాదంబరి జత్వానీతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి.. ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌ గున్నీలను ఇప్పటికే ఏకపక్షంగా సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం.. వారిపై మరిన్ని వేధింపులకు పాల్పడేందుకు సన్నద్ధమవుతుండటం పట్ల ఆగ్రహం వ్యక్యం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ విజయవాడలో ప్రత్యక్షం కావడం వెనుక పక్కా కుట్ర దాగి ఉందని అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. 

గతంలో ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును నీరుగారుస్తామని చెబుతూ.. అందుకు ప్రతిగా ఆ ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయమని ఆమెకు షరతు విధించినట్టు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ కథ, స్క్రీన్‌ ప్లే ప్రకారం కాదంబరి జత్వానీ నెల రోజులుగా విజయవాడలో హైడ్రామా సృష్టిస్తున్నారు. జత్వానీపై ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. వలపు వలతో బడా బాబులను బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడం ఆమె వ్యాపకంగా చేసుకున్నారని పలు ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి.

నిందితురాలితో ప్రభుత్వం కుమ్మక్కు
పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన ఐదు ఎకరాలను ఫోర్జరీ పత్రాలతో మరొకరికి విక్రయించేందుకు కూడా కాదంబరి జత్వానీ బరి తెగించారు. వెంటనే అప్రమత్తమైన విద్యాసాగర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయస్థానం అనుమతితో నిబంధనలను పాటిస్తూ ముంబయిలో ఆమెను అరెస్ట్‌ చేసి విజయవాడ తీసుకువచ్చారు. ఫోర్జరీ అభియోగాలకు సంబంధించి పోలీసులు సమర్పించిన ఆధారాలతో న్యాయస్థానం సంతృప్తి చెంది ఆమెకు రిమాండ్‌ విధించింది. 

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత మాత్రాన జత్వానీ గతంలో పాల్పడిన తీవ్రమైన, జుగుప్సాకరమైన నేరాలు ఒక్క దెబ్బతో మాయమైపోయినట్టు కాదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తన ఫోర్జరీ బాగోతాన్ని ఆధారాలతోసహా వెలికి తీసినందుకే ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై ఆమె కక్ష గట్టారు. కాగా ఆ పోలీసు అధికారులను అక్రమ కేసులతో వేధించాలని అప్పటికే నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం కాదంబరి జత్వానీని తమ కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. 

ప్రభుత్వ పెద్దలు ఆమెతో ఇటీవల ఇప్పించిన ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఇంకొందరు పోలీసు అధికారుల పేర్లను కూడా చేర్చేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, అధికారులను అవమానిస్తూ వేధిస్తున్న తీరు అఖిల భారత సర్వీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఇదే ప్రభుత్వ విధానంగా మారితే.. రాష్ట్రంలో ఏ అఖిల భారత స్థాయి అధికారి కూడా నిబద్ధతతో పని చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. 

ఏదైనా నేరానికి పాల్పడిన వారిపై విచారణ నిర్వహించి పక్కా ఆధారాలతో చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పెద్దలు అభినందించాలి. కానీ నిందితులతో కుమ్మక్కై అధికారులనే వేధిస్తుంటే రాష్ట్రంలో పని చేసేందుకు ఏ అఖిత భారత సర్వీసు అధికారి కూడా ఇష్టపడరని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మనో ధైర్యం దెబ్బతింటే అంతిమంగా ప్రజలే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో టార్గెట్‌ రామకృష్ణే .. 
చంద్రబాబు, ఈనాడు రామోజీరావు కుటుంబం క్విడ్‌ ప్రో కోకుట్ర మరోసారి అధికారికంగా బట్టబయలవుతోంది. అందులో భాగంగానే స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ పూర్వపు ఐజీ రామకృష్ణకు టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. ఎందుకంటే.. రామోజీరావు కుటుంబం దశాబ్దాలుగా మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ ద్వారా యథేచ్చగా పాల్పడిన ఆర్థిక అక్రమాలను ఆధారాలతో సహా ఆయన నిగ్గు తేల్చారు. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఐఆర్‌ఎస్‌ అధికారి రామకృష్ణ.. కేంద్ర చిట్‌ ఫండ్‌ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నించారు. 

ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు కుటుంబం మార్గదర్శి చిట్స్‌ చందాదారుల సొమ్మును అక్రమ మార్గాల ద్వారా మళ్లించి తమ కుటుంబ వ్యాపార సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులుగా పెట్టినట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గుర్తించింది. ఘోస్ట్‌ చందాదారుల పేరుతో అక్రమాలు, రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర ఆర్థిక నేరాలను వెలుగులోకి తెచ్చింది. దాంతో రెండేళ్లపాటు మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌లో కొత్త చిట్టీ గ్రూపులు నిలిచి పోవడంతో రామోజీ కుటుంబ ఆర్థిక అక్రమాల పునాదులు కదిలాయి. 

స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమాలకు పక్కా ఆధారాలు లభించడంతో గత ఏడాది రామోజీరావు (ప్రస్తుతం చనిపోయారు), ఆయన కోడలు శైలజ కిరణ్‌ను హైదరాబాద్‌లో విచారించారు. ఇది ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న చంద్రబాబుకు ఏమాత్రం రుచించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రామకృష్ణను వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనకు పోస్టింగు ఇవ్వనే లేదు. 

మరోవైపు ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఆయన డెప్యుటేషన్‌ పూర్తి కావడంతో కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్‌ చేయకపోయినా సరే.. డీమ్డ్‌ టు బీ రిలీవ్డ్‌గా పరిగణించి ఆయనకు కేంద్ర ప్రభుత్వం పోస్టింగు ఇచ్చేందుకు సిద్ధమైంది. నిబంధనల మేరకు సాగుతున్న పరిణామాలపై రామోజీరావు కుటుంబం భగ్గుమంది. రామకృష్ణను లక్ష్యంగా చేసుకుని ఈనాడు పత్రికలో రెండు రోజులుగా ప్రత్యేక కథనాలు ప్రచురించారు. రాజగురువు కుటుంబానికి ఆగ్రహం కలిగిందని బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం.. నిబంధనలను అతిక్రమించేందుకు కూడా వెనుకాడటం లేదు. 

రామోజీ కుటుంబాన్ని సంతృప్తి పరిచేందుకు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలాయాన్ని ఆదేశించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారి అయిన ఆయనపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. 

కానీ రామోజీ కుటుంబం కళ్లల్లో ఆనందం చూడటమే తమ లక్ష్యం.. అన్నట్లు రామకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసినట్టు సమాచారం. దాంతో రామకృష్ణపై ప్రభుత్వం ఒకట్రెండ్రోజుల్లో కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement