సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. విద్యాసాగర్ కస్టడీ కోరుతూ విజయవాడ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని అక్టోబర్ 1 వరకు ఆ కోర్టును పట్టుబట్టబోమని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసకున్న హైకోర్టు.. విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)కు తెలపాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎలాంటి కారణాలు చెప్పకుండానే విజయవాడ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని, తన అరెస్టును అక్రమమని ప్రకటించాలని కోరుతూ విద్యాసాగర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. విద్యాసాగర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో పలు రాజ్యాంగపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదన్నారు.
పోలీసుల తరపున రాష్ట్ర పీపీ మెండ లక్ష్మీనారాయణ జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యం విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేయాలని, అప్పటివరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరపాలని కింది కోర్టును పట్టుబట్టవద్దని సంబంధిత పీపీకి చెబుతామని ప్రతిపాదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆ మేర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కూడా పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను 1వ తేదీకి వాయిదా వేశారు.
హనుమంతరావు పిటిషన్‌పై విచారణ 1కి వాయిదా
జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విజయవాడ వెస్ట్‌జోన్ అప్పటి ఏసీపీ హనుమంతరావు దాఖలు చేసిన వ్యాజ్యం తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 1కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment