
పశువులకూ కు.ని. కేంద్రం
డెహ్రాడూన్: వీధి కుక్కల సంతతిని నిరోధించడంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశకాలను అనుసరిస్తూ దేశంలోనే మొట్టమొదటి పశు సంతతి నిరోధక కేంద్రం ఏర్పాటయింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పట్టణంలో ఏర్పాటుచేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్(ఏబీసీ)ను కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ శనివారం ప్రారంభించారు.
దాదాపు ఎకరం స్థలంలో నిర్మించిన ఈ కేంద్రంలో వీధి కుక్కలకే కాక పెంపుడు కుక్కలకు కూడా సంతాన నిరోధక ఆపరేషన్లు చేయనున్నట్లు, ఇందుకోసం అన్ని వసతులతో కూడిన 72 దొడ్లను నిర్మించినట్లు మంత్రి మనేకా పేర్కొన్నారు. ఈ తరహా కేంద్రం దేశంలో ఇదే మొదటిదని, పశు సంతతి వ్యాప్తి నిరోధమేకాక కుక్క కాటు వల్ల సోకే రెబీస్ వ్యాధి నిరోధక కేంద్రంగానూ ఏబీసీ పనిచేస్తుందని ఆమె తెలిపారు. జంతు హింస నిరోధక చట్టం-1960ని అనుసరించి ఏర్పాటుచేసే ఇలాంటి కేంద్రాలను దేశంలోని మిగతా ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉంది.