
సాక్షి, అమరావతి: ‘‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లోపాలను సాకుగా తీసుకుని ఈ చట్టం అమలులోకి వచ్చిన 25 ఏళ్ల తరువాత కూడా యథేచ్ఛగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. ఇలా పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుడిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించేందుకు వీలుగా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది’’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. డెహ్రాడూన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న అఖిల భారత చట్టసభల అధ్యక్షుల(ప్రిసైడింగ్ అధికారుల) సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు.
‘ఫిరాయింపుల నిరోధక చట్టం–సంస్కరణల ఆవశ్యకత’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. చట్టంలోని లోపాలను తొలగించకపోతే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య కాలంలో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఆయన ఉదహరిస్తూ.. రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసేవిగా ఇవి ఉన్నాయన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా అప్పటి సభాపతి వాటిని పట్టించుకోకపోవడం రాజ్యాంగ సూత్రాలను నిర్లక్ష్యం చేయడమేనన్నారు.
జగన్ నిర్ణయానికి అన్ని పార్టీలూ మద్దతు తెలపాలి
శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయకుండా పార్టీలోకి ఇతర పక్షాలకు చెందిన ఏ సభ్యుడిని అనుమతించబోనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న విలువలతో కూడుకున్న నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని తమ్మినేని కోరారు. పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ప్రతి ఫిర్యాదును కచ్చితంగా ఇన్ని రోజుల వ్యవధి లోపల పరిష్కరించి తీరాలన్న నిబంధనను చట్టంలో చేర్చాలని సూచించారు. ‘స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవడం’ అన్న అంశానికి కచ్చితమైన నిర్వచనాన్ని కూడా చట్టంలో పొందుపర్చాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ‘విలీన’ నిబంధనను కూడా స్పష్టంగా నిర్వచించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. సభాపతులు సరైన న్యాయబద్ధమైన నిర్ణయాలను తీసుకోక పోవడం వల్లే స్పీకర్ల వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందన్నారు. 18, 19 తేదీల్లో నిర్వహించిన ఈ సదస్సులో చట్టసభల నిర్వహణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment