సంచార ఇంటిలో రుచీ పాండే, దీపక్(PC: Vanlife indiancouple)
ప్రయాణంలో ఏమున్నది? అనే ఒకే ప్రశ్నకు వందల సమాధానాలు దొరుకుతాయి. సేద తీర్చే సెరువున్నది... నీడ కోసం చింత చెట్టున్నది... సిటారు కొమ్మన తేనెపట్టున్నది. వీటికి మించి మనల్ని కొత్తగా వెలిగించే తత్వం దాగున్నది. అందుకే రుచీపాండే, దీపక్ దంపతులు వ్యాన్‌నే ఇంటిని చేసుకొని లోకసంచారం చేస్తున్నారు...
దెహ్రాదూన్(ఉత్తరాఖండ్) కాలేజీలో చదువుకునే రోజుల్లో రుచీ పాండే, దీపక్‌లు మంచి స్నేహితులు. ప్రేమలో పడడానికి ముందే ‘ట్రావెలింగ్’తో ప్రేమలో పడ్డారు. ప్రయాణం అంటే ఇద్దరికీ చెప్పలేనంత ఇష్టం. మొదట్లో దెహ్రాదూన్ నగరం ప్రతి మూలా చుట్టేశారు. ఆ తరువాత పొరుగు నగరాలు.
‘పెళ్లికి ముందు ఎన్నో అనుకుంటాం. పెళ్లి తరువాత అన్నీ ఆవిరైపోతాయి’ అని భారంగా నిట్టూర్చేవాళ్లను చూస్తుంటాం. అయితే ఒకేరకమైన అభిరుచులు ఉన్న రుచీ, దీపక్‌లు పెళ్లి తరువాత కూడా తమకు ఇష్టమైన ప్రయాణాలను మానలేదు. దీపక్‌ది రెండు సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయ్యే ఉద్యోగం. ఎక్కడికి బదిలీ అయినా అక్కడి చుట్టుపక్కల కొత్త ప్రదేశాల గురించి ఆరా తీసి రుచీపాండేతో కలిసి ప్రయాణానికి ఛలో అనేవాడు.
మొదట్లో టాటా ఇండికా వాడేవారు. ఆ తరువాత సఫారిలోకి షిఫ్ట్ అయ్యారు.
ఒకప్పుడంటే తాము ఇద్దరమే కాబట్టి ఈ వాహనం ఓకే. కాని ఇప్పుడు ఇద్దరు పిల్లలు, రెండు పెంపుడు శునకాలు.
కరోనా వల్ల హోటల్లో ఉండలేని పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ తినే వీలు లేకపోవడం... వీటిని దృష్టిలో పెట్టుకొని ‘కారవ్యాన్’పై దృష్టి పెట్టారు.
గత సంవత్సరం ఫోర్స్ ట్రావెలర్ 3350 కొనుగోలు చేశారు. తమ సౌకర్యాలకు అనుగుణంగా దీన్ని మార్చుకోవడానికి యూఎస్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి బాగా ఖర్చయింది. ఇది ఒక ఎత్తయితే ‘వైట్–బోర్డ్ వెహికిల్’ కోసం ఆర్టీవో నుంచి అనుమతి పొందడం అనేది మరో ఎత్తు.
‘ఈ వాహనం మా కుటుంబం కోసమే, కమర్షియల్ వర్క్ కోసం కాదు అని ఉన్నతాధికారులను నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది’ అంటుంది రుచీపాండే.
విదేశాలకు చెందిన రకరకాల కారవ్యాన్‌లను చూస్తూ డిజైన్‌పై ఒక అవగాహనకు వచ్చారు. ఈ వీడియోలను నిపుణులైన పనివాళ్లకు చూపిస్తూ వ్యాన్ డిజైన్ చేయించారు. మూడు నెలలు నాన్–స్టాప్‌గా కష్టపడిన తరువాత తమ కలల వాహనం సిద్ధం అయింది.
ఖర్చు లక్షలు అయింది
ఇందులో సౌకర్యవంతమైన సీట్లు, కిచెన్, బాత్‌రూమ్, రెండు బెడ్‌లు, వాటర్ ట్యాంక్, షవర్, గ్యాస్, మైక్రోవేవ్, పైన సోలార్ ప్యానల్స్, కెమెరాలు...ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంటిని మరిపించే సంచార ఇల్లు ఇది. దీన్ని తమ అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి చేసిన ఖర్చుతో సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొనుగోలు చేయవచ్చు. తొలి ప్రయాణం లేహ్, లద్దాఖ్. దీపక్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. నచ్చిన చోట ఆగడం, ప్రకృతి అందాలను వీక్షించడం...ప్రయాణంలోని మజాను దీపక్ తల్లిదండ్రులు ఆస్వాదించారు.
‘సాధారణ కారులో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కష్టం. భోజనం నుంచి నిద్ర వరకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండడం, స్మూత్ డ్రైవింగ్ వల్ల మా వ్యాన్‌లో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేశారు. గ్రామీణప్రాంతాలలో పార్కింగ్ అనేది కష్టం కాదు.
అయితే పట్టణ ప్రాంతాలలో మాత్రం హోటల్ పార్కింగ్‌లను ఎంచుకునేవాళ్లం. వ్యాన్‌లోనే అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల బయట క్యాంప్ ఏర్పాటు చేసుకునే అవసరం రాలేదు’ అంటుంది రుచీ పాండే. గుజరాత్‌లో 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన అనుభవం తమకు ప్రత్యేకమైనది.
వీరి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? ఈ కారవ్యాన్‌పై నలభై దేశాలు చుట్టి రావాలనేది వారి కల.
Comments
Please login to add a commentAdd a comment