డెహ్రాడూన్ : బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే నెపంతో తోటి విద్యార్థిపై దాడి చేసి చంపేశారు సీనియర్ విద్యార్థులు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు యాజమాన్యం చనిపోయిన బాలుని మృతదేహాన్ని ఖననం చేసింది. రెండు వారాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకుని వెళ్లాలని నిర్ణయించింది. అదే సమయంలో వాసు యాదవ్(12) అనే బాలుడు ఓ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని షాపు యజమాని ఆరోపించాడు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాడు.
దాంతో విద్యార్థులు ఎవరూ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లొద్దని యాజమాన్యం ఆదేశించింది. ఔటింగ్ క్యాన్సిల్ కావడంతో వాసు యాదవ్ మీద సీనియర్ విద్యార్థులు కోపం పెంచుకున్నారు. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో వాసు యాదవ్‌ను చావబాదారు. ఆ తర్వాత అతడిని చిత్రహింసలు పెట్టి శరీరం మీద చన్నీళ్లు పోశారు. అంతే కాదు, అతడిని కొన్ని గంటల పాటు క్లాస్ రూమ్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత బాలుడిని వార్డెన్ గుర్తించారు.
తీవ్రంగా గాయపడిన వాసును ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఈ విషయం బయటకు పొక్కితే పాఠశాలకే ప్రమాదం అని భావించిన యాజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా వాసు మృతదేహాన్ని ఖననం చేశారు. కానీ ఈ వార్త బయటకు రావడంతో సమాచారం రాబట్టేందుకు లోకల్ మీడియా ప్రయత్నించింది. కానీ పాఠశాల యాజమాన్యం వారిని పాఠశాల లోనికి అనుమతించలేదు.
చివరకు ఈ విషయం గురించి ఓ ఆంగ్ల పత్రికలో రావడంతో పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విచారణ చేశారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. తీవ్రంగా గాపడిన వాసును సకాలంలో ఆస్పత్రికి తరలించలేదు. అంతేకాక వాసు చనిపోయినట్లు అతని తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేద’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment