biscuit packet
-
బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం!
పటాన్చెరు: బిస్కెట్ ప్యాకెట్ కొనేందుకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తితోపాటు నాలుగేళ్ల బాలుడు చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన అబేద్ అలీ బతుకుదెరువు కోసం పటాన్చెరు మండలం ముత్తంగికి వలస వచ్చాడు. స్థానికంగా ఉన్న వేంకటేశ్వర బ్రిక్స్ కంపెనీలో పని చేసుకుంటూ పక్కనే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరు పనిచేసే చోట బీహార్‌కు చెందిన సోనుకుమార్ అలియాస్ మునిలాల్(38) పని చేసుకుంటూ అక్కడే గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి సోనుకుమార్, అబేద్ అలీ కుమారుడు రంజన్ అలీ(4)ని తీసుకొని బిస్కెట్ ప్యాకెట్ కొనేందుకు దుకాణానికి రోడ్డు దాటి వెళ్లాడు. బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని తిరిగి రోడ్డు దాటుతుండగా పటాన్చెరు వైపు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై సోనుకుమార్, బాలుడు రంజన్ అలీ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి చదవండి: వివాహమైన రెండేళ్లకే నూరేళ్లు! అనాథగా తొమ్మిదినెలల కుమారుడు.. -
ఆ ఒక్క బిస్కెట్ విలువ రూ.1 లక్ష !
తిరువల్లూర్(తమిళనాడు): చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొంటే అందులో ఒక బిస్కెట్ మిస్సయింది. ప్యాకెట్లో లేని ఆ ఒక్క బిస్కెట్ విలువ ఎంత ఉంటుంది?. నిజానికి అదేం బంగారు బిస్కెట్ కాదు కాబట్టి దాని విలువ చాలా తక్కువే ఉంటుంది. కానీ ఆ ఒక్క బిస్కెట్ కోసం ఐటీసీ ఫుడ్స్ వారు రూ.1 లక్ష జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమిటీ బిస్కెట్ బాగోతం అనేగా మీ సందేహం. వివరాల్లోకి వెళ్తే అంతా తెలుస్తుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పి.దిల్లిబాబు అనే వ్యక్తి ఇటీవల సన్‌ఫీస్ట్ మ్యారీ లైట్ అనే బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. ‘ఈ ప్యాకెట్లో 16 బిస్కెట్లు ఉంటాయి’ ఆ ప్యాకెట్ రేపర్‌పై ఉంది. అది చూసిన దిల్లిబాబు సరదాకి ప్యాకెట్లోని బిస్కెట్లు లెక్కించాడు. ఒక బిస్కెట్ లెక్క తగ్గింది. తప్పుడు ప్రచారం చేస్తూ కంపెనీ మోసం చేస్తోందంటూ నేరుగా ఆయన తిరువల్లూర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ వద్దకెళ్లి కేసు వేశారు. ప్యాకెట్‌ను తయారుచేసిన ఐటీసీ ఫుడ్స్ సంస్థపై రూ.100 కోట్ల పెనాల్టీ వేయాలని కోరారు. సరైన వ్యాపార విధానాలు అవలంభించని కారణంగా రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో సేవా లోపాన్ని ఎత్తిచూపారు. ప్యాకెట్‌ను బరువు ఆధారంగా విక్రయిస్తామేగానీ అందులో ఉన్న బిస్కెట్ల సంఖ్యను బట్టి కాదు అంటూ తయారీసంస్థ చేసిన వాదనలను వినియోగదారుల ఫోరమ్ పట్టించుకోలేదు. ‘ రేపర్‌పై ఉండే సమాచారంతో సంతృప్తి చెందిన వినియోగదారులే ఆయా వస్తువులను కొంటారు. బరువును చూసి కాదు ఇందులోని బిస్కెట్ల సంఖ్యను చూసే కొనండి అని రేపర్‌పై ప్రత్యేకంగా ముద్రించి ఉంది’ అంటూ కోర్టు గుర్తుచేసింది. వినియోగదారునికి రూ.1 లక్ష నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.10 వేలు అందించాలని సూచించింది. -
పార్లేలో 10 వేల ఉద్యోగాలకు ఎసరు
ముంబై: అమ్మకాలు పడిపోతుండటంతో వివిధ రంగాల సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే కూడా ఈ జాబితాలో చేరనుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో వచ్చే ఏడాది కాలంలో సుమారు 10,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి రావొచ్చని పార్లే ప్రోడక్ట్స్ విభాగం హెడ్ మయాంక్ షా తెలిపారు. సామాన్యుల కోసం ఉద్దేశించిన చౌక ఉత్పత్తులపై కూడా అధిక స్థాయిలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధింపు, డిమాండ్ మందగమనం వంటి అంశాలు ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పార్లేకు సొంతంగా 10 తయారీ యూనిట్లు ఉండగా, థర్డ్ పార్టీ తయారీ సంస్థలు 125 దాకా ఉన్నాయి. బిస్కెట్ తయారీతో పాటు ఇతర వ్యాపార విభాగాల్లో పార్లేలో ప్రస్తుతం లక్ష మంది పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ‘ఇప్పటికైతే ఉద్యోగులెవరినీ తొలగించలేదు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోతే ఈ చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు’ అని మయాంక్ షా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ విక్రయ పరిమాణం ఉండే చౌక ఉత్పత్తుల అమ్మకాలు 7–8 శాతం పడిపోగా, తక్కువ విక్రయ పరిమాణం.. అధిక ధర ఉండే ఉత్పత్తుల అమ్మకాలు 8–9 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. మొత్తం మీద బిస్కెట్ల విభాగం అమ్మకాల వృద్ధి గతంలో రెండంకెల స్థాయిలో ఉండేదని.. ప్రస్తుతం 2.5 శాతానికి పడిపోయిందని షా పేర్కొన్నారు. చౌక ఉత్పత్తుల విభాగం మొత్తం బిస్కెట్ల వ్యాపారంలో నాలుగో వంతే ఉన్నప్పటికీ.. అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయాల్సినందున ఇందులో ఎక్కువ మంది సిబ్బంది ఉంటారని షా చెప్పారు. గతంలో కేజీకి రూ. 100 లోపు ధర ఉండే బిస్కెట్లకు ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు ఉండేదని ఆయన తెలిపారు. అయితే, 2017లో బిస్కెట్లను కూడా 18 శాతం జీఎస్టీ శ్లాబులో చేర్చినప్పట్నుంచీ పరిశ్రమకు సమస్యలు ప్రారంభమయ్యాయని షా చెప్పారు. అధిక జీఎస్టీ కారణంగా చౌక ఉత్పత్తుల రేట్లను కూడా తాము పెంచాల్సి వచ్చిందని, దీంతో డిమాండ్ పడిపోయిందని ఆయన తెలిపారు. జీఎస్‌టీపరమైన సమస్యలు సరిదిద్దాలంటూ పరిశ్రమ కోరుతున్నప్పటికీ .. ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పైప్‌కు కట్టేసి.. దారుణంగా హింసించి
డెహ్రడూన్ : బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే నేపంతో సీనియర్లు ఓ విద్యార్థిని కొట్టి చంపారనే వార్త డెహ్రడూన్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు సదరు విద్యార్థి మృతదేహాన్ని స్కూల్ ఆవరణలోనే ఖననం చేసింది. స్థానిక మీడియా ప్రోద్బలంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకెళ్తుండగా బాధితుడు దగ్గర్లోని కిరాణ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని షాపు యజమాని ఉపాధ్యాయులకు తెలిపాడు. దాంతో ఔటింగ్ క్యాన్సల్ అయ్యింది. బాధితుడి వల్లే ఇలా జరిగిందని భావించిన సీనియర్ విద్యార్థులు అతన్ని ఒక క్లాస్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. బాధితుడి కాళ్లు చేతులను ఓ పైప్‌కి కట్టి బ్యాట్, స్టంప్స్ తీసుకోని విపరీతంగా కొట్టారు. అంతేకాక సదరు విద్యార్థి బట్టలు తొలగించి చల్లని నీటిలో ముంచారు. అంతటితో ఊరుకోక కుర్కురే చిప్స్‌ని, బిస్కెట్లని టాయిలెట్ వాటర్‌లో ముంచి తినమని బలవంతం చేశారు. దెబ్బల ధాటికి తట్టుకోలేక సదరు విద్యార్థి చేసిన ఆక్రందనలు పాఠశాలలో ఉన్న 200 మంది విద్యార్థులు కానీ.. ఉపాధ్యాయులు కానీ వినిపించలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సదరు విద్యార్థి ఒంటరిగా అదే గదిలో పడి ఉన్నాడు. సాయంకాలం వార్డెన్ ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కితే ప్రమాదం అని భావించిన పాఠశాల యాజమాన్యం సదరు బాలుడి మృతదేహాన్ని పాఠశాలలోనే ఖననం చేసింది. ఆ తర్వాత మృతుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫుడ్ పాయిజన్ వల్ల మీ అబ్బాయి చనిపోయాడని తెలిపారు. కానీ స్థానిక మీడియా విద్యార్థి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేయడం.. యాజమాన్యం కూడా బయటి వారిని లోపలికి అనుమతించకపోవడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో వారు పాఠశాలకు వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో పోలీసులు చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ రిపోర్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరు ఇంటర్ విద్యార్థులతో పాటు ముగ్గురు పాఠశాల సిబ్బందిని, వార్డెన్ని కూడా అరెస్ట్ చేశారు. -
దారుణం.. బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని
డెహ్రాడూన్ : బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే నెపంతో తోటి విద్యార్థిపై దాడి చేసి చంపేశారు సీనియర్ విద్యార్థులు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు యాజమాన్యం చనిపోయిన బాలుని మృతదేహాన్ని ఖననం చేసింది. రెండు వారాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకుని వెళ్లాలని నిర్ణయించింది. అదే సమయంలో వాసు యాదవ్(12) అనే బాలుడు ఓ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని షాపు యజమాని ఆరోపించాడు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాడు. దాంతో విద్యార్థులు ఎవరూ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లొద్దని యాజమాన్యం ఆదేశించింది. ఔటింగ్ క్యాన్సిల్ కావడంతో వాసు యాదవ్ మీద సీనియర్ విద్యార్థులు కోపం పెంచుకున్నారు. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో వాసు యాదవ్‌ను చావబాదారు. ఆ తర్వాత అతడిని చిత్రహింసలు పెట్టి శరీరం మీద చన్నీళ్లు పోశారు. అంతే కాదు, అతడిని కొన్ని గంటల పాటు క్లాస్ రూమ్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత బాలుడిని వార్డెన్ గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వాసును ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఈ విషయం బయటకు పొక్కితే పాఠశాలకే ప్రమాదం అని భావించిన యాజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా వాసు మృతదేహాన్ని ఖననం చేశారు. కానీ ఈ వార్త బయటకు రావడంతో సమాచారం రాబట్టేందుకు లోకల్ మీడియా ప్రయత్నించింది. కానీ పాఠశాల యాజమాన్యం వారిని పాఠశాల లోనికి అనుమతించలేదు. చివరకు ఈ విషయం గురించి ఓ ఆంగ్ల పత్రికలో రావడంతో పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విచారణ చేశారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. తీవ్రంగా గాపడిన వాసును సకాలంలో ఆస్పత్రికి తరలించలేదు. అంతేకాక వాసు చనిపోయినట్లు అతని తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేద’ని తెలిపారు. -
ఇంటిప్స్
పట్టు చీరలు ఉతికేటప్పుడు బకెట్ నీటిలో కొంచెం నిమ్మరసం, ఉప్పు కలిపితే రంగు పోవు.వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో టీ స్పూన్ పాలు కలపాలి.బిస్కెట్ ప్యాకెట్ బియ్యం డబ్బాలో ఉంచితే అవి మెత్తబడవు. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచులకు నూనె రాయాలి. వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా వరకు తాజాగా ఉంటాయి. ఈగల బెడద లేకుండా ఉండాలంటే పుదీనా ఆకుల్ని గది నాలుగు మూలల్లో ఉంచాలి. శనగపిండితో స్టీలు, వెండి సామాన్లు తోమితే చక్కగా శుభ్రపడతాయి. మజ్జిగ పల్చనైతే కొన్ని కరివేపాకులు, ఉప్పు కలిపి రుబ్బి ఈ మిశ్రమాన్ని అందులో కలపాలి. మజ్జిగ రుచిగానూ, చిక్కగానూ ఉంటుంది. -
అన్నం కోసం అల్లాడిపోతున్నాం
అంట్లు తోమిస్తున్నారు మెనూ అమలు చేయడంలేదు కన్నీళ్లెట్టుకున్న హాస్టల్ విద్యార్థులు సిబ్బందిపై డీడీ ఆగ్రహం అవనిగడ్డ : ‘‘చదువుకునేందుకు వచ్చిన మాతో అంట్లు తోమిస్తున్నారు.. కడుపునిండా అన్నం పెట్టడం లేదు... మెనూ అమలు చేసిన పాపానపోలేదు’’ ఇదీ స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం-1 విద్యార్థుల ఆవేదన. ఆదివారం ఎంపీపీ బండె నాగవెంకట కనకదుర్గ, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరు వెంకటేశ్వరరావు (బుల్కి) వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమస్యలపై విచారణ నిర్వహించేందుకు సోమవారం రాత్రి డీడీ మధుసూదనరావు వసతి గృహానికి వచ్చారు. విద్యార్థులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. రాగిమాల్ట్ సక్రమంగా ఇవ్వడం లేదని, స్నాక్స్కింద ఇచ్చే బిస్కెట్ప్యాకెట్ను ముగ్గురికి పంచుతున్నారని, అన్నం సరిగా ఉడకడం లేదని, బాత్రూమ్లు సక్రమంగా లేవని, వసతి గృహంలో ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం పూర్తిస్థాయిలో లేదని కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. దీనిపై ఆగ్రహించిన డీడీ మధుసూదనరావు కమాటీ రవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో అంటులు తోమించడమేంటి, మెనూ సక్రమంగా అమలు చేయనందుకు నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం నుంచి ఒంట్లో బాగోని కారణంగా పిల్లలతో ఈ పనులు చేయిస్తున్నానని సమాధానం ఇవ్వగా... మాతో రోజూ ఇదే పని చేయించుకుంటున్నారని విద్యార్థులు డీడీకి వివరించారు. వారిపేర్లు డీడీ నమోదు చేసుకున్నారు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సూచించారు. పదోతరగతి విద్యార్థులు తామెదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ సాయంత్రం 5.30గంటల సమయంలో ప్రైవేటుకు వెళ్లేముందు అన్నం పెడుతున్నారని, రాత్రి 10గంటల సమయంలో తిరిగి వస్తామని, అప్పుడు ఆకలివేస్తున్నా హాస్టల్లో తినేందుకు ఏమీ పెట్టడం లేదని డీడీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రైవేటుకు వెళ్లేముందు స్నాక్స్, రాగిమాల్ట్ ఇవ్వాలని, విద్యార్థులు ప్రైవేటు నుంచి వచ్చిన తర్వాత వారికి భోజనం పెట్టాలని డీడీ ఆదేశాలు జారీచేశారు. వసతి గృహాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించి బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉండడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విచారణలో ఏఎస్‌డబ్ల్యువో జీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.