- అంట్లు తోమిస్తున్నారు
- మెనూ అమలు చేయడంలేదు
- కన్నీళ్లెట్టుకున్న హాస్టల్ విద్యార్థులు
- సిబ్బందిపై డీడీ ఆగ్రహం
అవనిగడ్డ : ‘‘చదువుకునేందుకు వచ్చిన మాతో అంట్లు తోమిస్తున్నారు.. కడుపునిండా అన్నం పెట్టడం లేదు... మెనూ అమలు చేసిన పాపానపోలేదు’’ ఇదీ స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం-1 విద్యార్థుల ఆవేదన. ఆదివారం ఎంపీపీ బండె నాగవెంకట కనకదుర్గ, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరు వెంకటేశ్వరరావు (బుల్కి) వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమస్యలపై విచారణ నిర్వహించేందుకు సోమవారం రాత్రి డీడీ మధుసూదనరావు వసతి గృహానికి వచ్చారు. విద్యార్థులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు.
రాగిమాల్ట్ సక్రమంగా ఇవ్వడం లేదని, స్నాక్స్‌కింద ఇచ్చే బిస్కెట్‌ప్యాకెట్‌ను ముగ్గురికి పంచుతున్నారని, అన్నం సరిగా ఉడకడం లేదని, బాత్‌రూమ్‌లు సక్రమంగా లేవని, వసతి గృహంలో ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం పూర్తిస్థాయిలో లేదని కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. దీనిపై ఆగ్రహించిన డీడీ మధుసూదనరావు కమాటీ రవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులతో అంటులు తోమించడమేంటి, మెనూ సక్రమంగా అమలు చేయనందుకు నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితం నుంచి ఒంట్లో బాగోని కారణంగా పిల్లలతో ఈ పనులు చేయిస్తున్నానని సమాధానం ఇవ్వగా... మాతో రోజూ ఇదే పని చేయించుకుంటున్నారని విద్యార్థులు డీడీకి వివరించారు. వారిపేర్లు డీడీ నమోదు చేసుకున్నారు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సూచించారు. పదోతరగతి విద్యార్థులు తామెదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ సాయంత్రం 5.30గంటల సమయంలో ప్రైవేటుకు వెళ్లేముందు అన్నం పెడుతున్నారని, రాత్రి 10గంటల సమయంలో తిరిగి వస్తామని, అప్పుడు ఆకలివేస్తున్నా హాస్టల్‌లో తినేందుకు ఏమీ పెట్టడం లేదని డీడీ దృష్టికి తీసుకొచ్చారు.
ప్రైవేటుకు వెళ్లేముందు స్నాక్స్, రాగిమాల్ట్ ఇవ్వాలని, విద్యార్థులు ప్రైవేటు నుంచి వచ్చిన తర్వాత వారికి భోజనం పెట్టాలని డీడీ ఆదేశాలు జారీచేశారు. వసతి గృహాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించి బాత్‌రూమ్‌లు అపరిశుభ్రంగా ఉండడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విచారణలో ఏఎస్‌డబ్ల్యువో జీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.