
డెహ్రాడూన్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు ఫైన్ వేస్తారు. లేదంటే వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలిగిస్తారు. కానీ, ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని ఓ వ్యక్తితో అమానుషంగా ప్రవర్తించారు. బైక్ తాళం చెవిని అతని మొహంపై పెట్టి బలంగా నెట్టేశారు. దీంతో ఆ కీ అతని నుదురులోకి చొచ్చుకుపోయి తీవ్ర రక్తస్రావమైంది. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్‌లోని ఈ ఘటన జరిగింది.
ఈఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ముగ్గురు ట్రాఫిక్ సిబ్బందిని పై అధికారులు సస్పెండ్ చేశారు. అయితే, వాహనదారుడిపై పోలీసుల దాడి విషయం బయటపడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ కుమార్ జోక్యంతో పరిస్థితులు చక్కబడ్డాయి. స్థానికులు నిరసన విరమించారు. పోలీసుల దాడిలో గాయపడ్డ వాహనదారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.