రివేంజ్ కోసం పూజలు చేస్తున్న ఖలీ!
డెహ్రాడూన్: ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ కోలుకున్నాడు. ఆదివారం జరుగనున్న మ్యాచులో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులపై రివేంజ్ తీర్చుకోవడానికి అతను సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం డెహ్రాడూన్‌లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాడు. ఈ పూజలో ఖలీతోపాటు అతని అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్తరఖండ్ బల్దానీలో గురువారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఖలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఫైట్ సందర్భంగా రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు కూడా వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్‌లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందిన ఖలీ శనివారం కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. 'ది గ్రేట్ ఖలీ షో'లో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైట్ కోసం సిద్ధమవుతున్నాడు. తనపై దాడి చేసిన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటానని, తన తదుపరి ఫైట్‌లో దెబ్బకు దెబ్బ కొట్టి తన సత్తా చాటుతానని ఖలీ ఇప్పటికే ప్రకటించాడు.
7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెస్లర్లుకు దడపుట్టించేలే ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. భారత్ పేరును రెజ్లింగ్ ఖండాతరాలు దాటేలా చేశారు.