
150 గంటల నిర్విరామ విద్యా బోధన సక్సెస్!
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో కామర్స్ లెక్చరర్ మారుతీరావు తలపెట్టిన 150 గంటల నిర్విరామ బోధన ఆదివారం విజయవంతంగా పూర్తి చేశారు.
జహీరాబాద్: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో కామర్స్ లెక్చరర్ మారుతీరావు తలపెట్టిన 150 గంటల నిర్విరామ బోధన ఆదివారం విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన అరవింద్ మిశ్రా పేరిట ఉంది. ఆయన 139 గంటలు ఏకధాటిగా బోధించి రికార్డు సాధించారు. తాజాగా ఆ రికార్డును మారుతీరావు అధిగమించారు.
ఈ నెల 9న ఉదయం 7.30 గంటలకు స్థానిక వశిష్ట డిగ్రీ కళాశాలలో నిర్విరామ విద్యాబోధనను ప్రారంభించిన మారుతీరావు ఆది వారం మధ్యాహ్నం 3.30 గంటలకు సెమినార్ ముగించారు. లక్ష్యానికి గంటన్నర అదనంగా తరగతులు చేపట్టారు. ఈ సెమినార్‌లో ట్యాక్సేషన్, అకౌంట్స్, కాస్ట్ అక్కౌంట్స్‌పై విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. వీటికి సంబంధించి గిన్నిస్ వారికి ప్రతిపాదించనున్నట్లు మారుతీరావు పేర్కొన్నారు.
2006 నుంచి ప్రయత్నం..
మారుతీరావు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు నిరంతర విద్యాబోధన తరగతులు నిర్వహించారు. మొదటి సారిగా 2006లో 12 గంటల పాటు ఏకధాటిగా తరగతులు బోధించారు. 2007లో 15 గంటలు, 2008లో 18 గంటలు, 2009లో 24 గంటలు, 2010లో 36 గంటలు, 2011లో 50 గంటలు, 2012లో 60 గంటలు, 2013లో 75 గంటల పాటు తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది మాత్రం 150 గంటలు విద్యాబోధన చేసి ప్రశంసలు అందుకున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేల అభినందన
150 గంటలపాటు నిర్విరామ విద్యాబోధన చేసిన లెక్చరర్ మారుతీరావును జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి అభినందించారు. ఆదివారం జహీరాబాద్‌లో నిర్వహించిన ముగింపు సభలో వారు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గీతారెడ్డి గంటపాటు తరగతి గదిలో కూర్చుని పాఠాలు విన్నారు.