డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో మహా కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై శనివారం కుంభమేళా నిర్వహణ అధికారి సంజయ్ గుంజ్వాల్ వివరణ ఇచ్చారు. గంగానదిలో స్నానాలు చేసిన వారిని కోవిడ్-19 "సూపర్-స్ప్రెడర్" అని పిలవడం సరికాదన్నారు. హరిద్వార్‌లో జనవరి 1 నుంచి నిర్వహించిన 8.91 లక్షల ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో కేవలం 1,954 (0.2 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అంతేకాకుండా కుంభమేళా డ్యూటీలో పాల్గొన్న 16,000 మంది పోలీసు సిబ్బందిలో కేవలం 88 (0.5శాతం) మంది కరోనా బారిన పడినట్టు ఆయన తెలిపారు. కుంభమేళా ప్రారంభం నుంచి ముగిసే వరకు హరిద్వార్ వ్యాప్తంగా కోవిడ్ డేటాను శాస్త్రీయంగా విశ్లేషిస్తే ఈ విషయాలు తెలిసినట్టు పేర్కొన్నారు.
‘సూపర్ స్ప్రెడర్’’ కుట్ర
కుంభమేళాపై ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనే అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం జరిగినట్టు గుంజ్వాల్ మీడియాకు తెలిపారు. ఇక ఏప్రిల్ 1 నాటికి హరిద్వార్‌లో 144 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. కుంభమేళా నిర్వహణ కాలం ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 55.55 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా..అందులో 17,333 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమానికి మార్చి నుంచే భక్తుల తాకిడి మొదలైందని, మహాశివరాత్రికి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని మేళా ఐజీ సంజయ్ గుంజ్యాల్ అన్నారు. ఈ సంవత్సరం కుంభంమేళా నిర్వహణ కాలంలో భక్తులు మూడు సార్లు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సమయంలో 34.76 లక్షల మంది భక్తులు గంగానదిలో స్నానాలు చేశారు. ఏప్రిల్ 12 (సోమావతి అమావాస్య)రోజున 21 లక్షల మంది, ఏప్రిల్ 14 (మేష్ సంక్రాంతి)నాడు 13.51 లక్షల మంది, ఏప్రిల్ 27( చైత్ర పూర్ణిమ) రోజున 25,104 మంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేసినట్టు ఆయన తెలిపారు.
(చదవండి: సెకండ్ వేవ్: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment