ఆ గుర్రం 'దేశద్రోహి' అయి ఉంటుందా?
డెహ్రాడూన్: మూగజీవమన్న కనికరం లేకుండా పోలీసు గుర్రం కాలు విరిగేలా చావబాదిన బీజేపీ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా డెహ్రాడూన్‌లో బీజేపీ సోమవారం తలపెట్టిన నిరసన ప్రదర్శనలో ఆ పార్టీ ఎమ్మెల్యే గణేష్ జోషి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.
నోరులేని మూగజీవాన్ని లాఠీతో చితకబాదిన ఆయన పైశాచికత్వంపై విమర్శలు వ్యక్తమవుతుండటంతో గణేష్ జోషి మాట మార్చారు. ఆయన గుర్రాన్ని కొడుతున్నట్టు వీడియో సాక్ష్యం ఉన్నప్పటికీ, ఆయన మాత్రం ఆ సమయంలో తాను అక్కడ లేనని చెప్తున్నారు. పోలీసు బందోబస్తులో భాగంగా వచ్చిన ఆ అశ్వం ఎండలో నిలబడటం వల్ల అలసిపోయి ఉంటుందని, ఆ తర్వాత దానికి నీళ్లు తాగించడంతో అది కోలుకుందని, దానికి ఎలాంటి గాయం కాలేదని ఆయన వాదిస్తున్నారు.
ఎమ్మెల్యే దాడితో తీవ్రంగా గాయపడి దీనంగా అరుస్తున్న ఆ గుర్రాన్ని స్థానిక మిలటరీ అకాడమీలోని పశువైద్యశాలకు తరలించిన సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా గుర్రంకాలిని తొలగించాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. మూగజీవాన్ని హింసించిన ఎమ్మెల్యేపై కఠినమైన చర్య తీసుకోవాలని జంతుహక్కుల సంస్థ పెటా డిమాండ్ చేస్తోంది. కాగా, ఆ పోలీసు గుర్రం 'దేశద్రోహి' అయి ఉంటుందని, అందుకే దానిపై ఎమ్మెల్యేగారు ప్రతాపం చూపి ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. జాతి వ్యతిరేక నినాదాలు చేశారంటూ ఇటీవల ఢిల్లీ కోర్టు ఎదుట బీజేపీ ఎమ్మెల్యే ఓ వ్యక్తిని కొట్టిన సంగతి తెలిసిందే.