
తెలుగు బాగా నేర్చుకున్నాను : లావణ్య త్రిపాఠి
‘మాది డెహ్రాడూన్. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరపై తొలిసారిగా అడుగుపెట్టా. అప్పట్నుంచీ తెలుగు నేల, తెలుగు సినిమా అంటే బాగా ఇష్టం ఏర్పడిపోయింది.
‘‘మాది డెహ్రాడూన్. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరపై తొలిసారిగా అడుగుపెట్టా. అప్పట్నుంచీ తెలుగు నేల, తెలుగు సినిమా అంటే బాగా ఇష్టం ఏర్పడిపోయింది. అందుకే తెలుగు బాగా నేర్చుకున్నాను. ఒక్కసారి డైలాగ్ వింటే తిరిగి చెప్పగలిగే స్థాయిలో తెలుగు నేర్చుకున్నాను’’ అని చెప్పారు లావణ్య త్రిపాఠి.
ప్రస్తుతం ఆమె ‘దూసుకెళ్తా’లో విష్ణుకి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్‌ని ముందుకు దూసుకెళ్లేలా చేస్తుందని నమ్మకం కనబరిచారు. మంగళవారం లావణ్య త్రిపాఠి పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘‘అందాల రాక్షసి’ తర్వాత విభిన్న పాత్ర కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘దూసుకెళ్తా’లో అవకాశం వచ్చింది.
ఇందులో నా పాత్ర పేరు డాక్టర్ అలేఖ్య. హీరో విష్ణు, దర్శకుడు వీరు పోట్ల అన్ని విషయాల్లో చక్కటి సలహాలిచ్చారు’’ అని చెప్పారు. శ్రీదేవి, మాధురి దీక్షిత్ తన అభిమాన కథానాయకలని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నానని, తెలుగులో కూడా మంచి ఆఫర్లు ఉన్నాయని లావణ్య తెలిపారు.