తొమ్మిదో తరగతి పిల్లలు.. పెళ్లికోసం జంప్!
డెహ్రాడూన్: దేశంలో అత్యంత పేరు ప్రతిష్టలు గల డూన్ స్కూలు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఈనెల 14న అదృశ్యమయ్యారు. వాళ్లలో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్లంతా ఎక్కడకు, ఎందుకు వెళ్లారో తెలుసా? ముంబై వెళ్లి, హాయిగా పెళ్లి చేసుకుని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని వెళ్లారు!!
స్కూలు యాజమాన్యం విద్యార్థుల అదృశ్యంపై వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చేతిలో సొమ్ము ఖాళీ కావడం, ఆకలి వేయడంతో ఓ జంట తిరిగి స్కూలుకు తిరిగొచ్చింది. ఆ జంటను విచారించగా పెళ్లి చేసుకుని... ముంబైలో పెద్ద ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో వెళ్లినట్లు చెప్పారు. దీంతో హతాశులైన విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.