హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింపజేయాలని, ఈ విషయంలో తాము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అన్నారు. ప్రత్యేక హోదా అమలు ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించిందనీ, వివిధ మార్గాల ద్వారా అధిక మొత్తంలో నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా విశేషమైన లబ్ధి సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం డెహ్రాడూన్‌లో ఆయనతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ, హోంమంత్రి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా వల్ల విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల కల్పన తదితర ప్రాధాన్యతా రంగాలకు భారీగా నిధులు రావడంతోనే పురోగతి సాధించామని, ప్రారిశ్రామిక ప్రోత్సాహకాల వల్ల పారిశ్రామికంగా వృద్ధి చెందామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇలాంటి చర్యల ఫలితంగా గడచిన 16 ఏళ్లలో తమ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి రేటు నమోదు అయ్యిందనీ, ప్రస్తుతం తాము అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి రఘువీరారెడ్డికి వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులకు కోత పెట్టేందుకు యత్నించినా సమర్థంగా వ్యతిరేకించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింప చేయాలంటూ సోనియా గాంధీ సమక్షంలోనే తీర్మానించామని ఆ విషయంలో ఏపీకి సంపూర్ణ మద్దతిస్తామని రఘువీరాకు ముఖ్యమంత్రి రావత్ స్పష్టం చేశారు.
'ఆంధ్రాకు ప్రత్యేక హోదా వర్తింపజేయాలి'
Published Fri, Jan 22 2016 6:18 PM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM
Advertisement
Advertisement