సోంపేట: తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న దుర్గారావు
కంటి వైద్యానికి తల్లిని కారులో తీసుకెళుతున్నాడు ఆ కొడుకు. మరికొద్ది సేపట్లోనే ఆస్పత్రికి చేరుకుంటామనగా ఆ వాహనాన్ని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ దుర్ఘటనలో తల్లి దుర్మరణం చెందారు. కొడుకుతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. శస్త్రచికిత్స చేయించడానికి తీసుకువెళుతుండగా తల్లి మృత్యువాతపడటంతో.. ఆమె మృతదేహం వద్ద కొడుకు విలపించిన తీరు అందరినీ కలచివేసింది.
సోంపేట: మండలంలోని బేసిరామచంద్రాపురం గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామానికి చెందిన బత్తిని ఈశ్వరమ్మ (50) మృతి చెందారు. బారువ పోలీçసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనూరు గ్రామానికి చెందిన బత్తిని ఈశ్వరమ్మ కంటి చూపు మందగించడంతో కుమారుడు దుర్గారావు, అల్లుడు సంగారు లక్ష్మణరావు, మరో బంధువు సంగారు సరోజనితో కలసి సోంపేటలోని కంటి ఆస్పత్రికి శస్త్రచికిత్సకు గురువారం కారుపై తీసుకెళుతున్నారు.
సైనూరు నుంచి ఉదయం బయలు దేరారు. సోంపేట ఆస్పత్రికి మరో పది నిమిషాల్లో చేరుకుంటారనగా లారీ రూపంలో వారికి ప్రమాదం ఎదురైంది. ఈ కారును బేసి రామచంద్రపురం గ్రామం జాతీయ రహదారి వద్ద పలాస నుంచి కంచిలి వెళుతున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఇందులో వెనుక సీట్లో ఉన్న ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. లక్ష్మణరావు, సరోజని, దుర్గారావుకు స్వల్ప గాయాలయ్యాయి.
కంటికి శస్త్రచికిత్స చేయించడానికి తీసుకువస్తుండగా ఈశ్వరమ్మ మృతి చెందడంతో కుమారుడు దుర్గారావు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈశ్వరమ్మ భర్త చలపతిరావు వలస కార్మికుడు. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైనూరులో విషాదఛాయలు
వజ్రపుకొత్తూరు: మండలంలోని సైనూరుకు చెందిన ఈశ్వరమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘కంటి వైద్యానికి వెళ్తూ కనిపించకుండా పోయావా? ఇంతలోనే వెళ్లి అంతలోనే మాయం అయ్యావా’ అంటూ బంధువుల రోదనలు చూపరులకు కంటితడిపెట్టించాయి. గ్రామస్తులు, బంధువులు మృతురాలి ఇంటి వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. మృతురాలికి భర్త బత్తిని చలపతిరావు విదేశాల్లో పనులు చేసుకుంటున్నాడు. కాగా, ఆమెకు కుమారుడు దుర్గారావు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment