
సాక్షి, శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి సాయం అందించి మంత్రి సీదిరి అప్పలరాజు గొప్ప మనసు చాటుకున్నారు. క్షతగాత్రులకు తన ప్రోటోకాల్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నుంచి తన స్వగ్రామానికి మంత్రి సీదిరి అప్పలరాజు కాన్వాయ్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో పూండి గ్రామ సమీపంలో బైక్‌పై వెళ్తూ ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఆ సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సీదిరి.. క్షతగాత్రులను చూశారు.
అనంతరం, వెంటనే రోడ్డు ప్రక్కనే కాన్వాయ్‌ని నిలిపివేసి వారికి ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్నారు. వారు తీవ్రంగా గాయపడటంతో తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో వారిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని గుర్తించిన మంత్రి సీదిరి.. హై స్పీడ్‌తో వెళ్లవద్దని సూచించారు. అతి వేగమే ప్రమాదాలకు కారణమవుతుందని హితవు పలికారు.