శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడుగా ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా సీదిరి అప్పల రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ‘‘భవిష్యత్తు అంతా వైఎస్సార్‌సీపీ పార్టీదే. కూటమి పాలనలో పధకాలన్నీ కొట్టుకుపోయాయి. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని అన్నారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. ‘‘పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. పార్టీ అధికారంలో లేనప్పుడు బరువు మోయడమే అసలైన పని. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా జగన్ పనిచేయమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం. 4 నెలలో ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. నేను ఆముదాలవలసలోనే ఉంటా.. ప్రజల కోసమే పనిచేస్తా. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ అన్ని ఆగిపోయాయి. నిత్యవసరాలు ఆకాశానంటుతున్నాయి. ధరల కంట్రోల్‌కి బడ్జెట్‌లోనే మేం నిధులు ఇచ్చేవాళ్లం. నాలుగు నెలలో రూ. 30 వేల కోట్లు అప్పుచేశారు. మెడికల్ సీట్లు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాయడం ఎంత దారుణం?. పేదల విద్యార్దులకు సీట్లు రాకుండా చేయడానికే కదా. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వరద సహాయం పేరుతో అక్రమాలు చేశారు’’ అని అన్నారు.
అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ, ‘‘ కార్యకర్తలు కసితో పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు మాయమాటలు చేబుతూనే వస్తున్నారు. బిర్యాని వస్తుందని పలావు పెట్టే వారిని ఓడించారు. ఇప్పుడు పలావు, బిర్యానీ రెండూ లేవు. వంద రోజుల్లో ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. గుడ్ బుక్ రాస్తాం.. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాడటం మొదలు పెడతాం’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment