శ్రీకాకుళం జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు మరింత బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై హత్యాయత్నం చేయడమేగాక ఫిర్యాదు చేసేందుకు వెళ్లినవారిపై పోలీస్ స్టేషన్‌లోనే దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వారిస్తున్న పోలీసుల్ని పక్కకు తోసేశారు. పోలీసు స్టేషన్‌లో కూడా బాధితులకు రక్షణ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన అనుచరులపై దాడిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులోని నిత్య ప్రైవేటు ఆస్పత్రి ఎదురుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడు, పాత్రికేయుడు అల్లు రమణ, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సభ్యుడు వేణుగోపాలరెడ్డి, మరో ఇద్దరు శనివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొర్ల విష్ణుచౌదరి తన కారులో అక్కడికి వచ్చాడు. కారునుంచి దిగి వారిపై దాడిచేశాడు. వారిని కొట్టి, కారులోంచి కత్తి తెచ్చి హత్యాయత్నం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న రమణ తన స్నేహితుడు మొదలవలస మన్మథరావును తీసుకుని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
పోలీసు స్టేషన్‌లోనే..
విష్ణుచౌదరి తమను హత్యచేయడానికి ప్రయత్నించిన కత్తిని పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ వద్ద అప్పగించిన రమణ, మన్మథరావు ఫిర్యాదు రాయసాగారు. అదేసమయంలో విష్ణుచౌదరి, టీడీపీకి చెందిన బడ్డ నాగరాజు, జోగ మల్లి, బడ్డ నాగరాజు బంధువులు ఇద్దరు, మరికొందరు పోలీసు స్టేషన్‌లోకి వచ్చి రమణ, మన్మథరావుపై దాడిచేశారు. వారి దుస్తులను చించేసి, పిడిగుద్దులతో రెచ్చిపోయి భయానక వాతావరణం సృష్టించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేసి, హెచ్చరించారు.
మీరిలా పోలీసు స్టేషన్‌లో కొడుతుంటే తమ ఉద్యోగాలు పోతాయని పోలీసులు ప్రాధేయపడినా టీడీపీ రౌడీలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నాయకుల దాడిని ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో బయట ప్రపంచానికి తెలిసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పలాస ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ వర్గీయులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
పోలీస్‌స్టేషన్‌లో దాడిపై కేసు నమోదు
కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ దాడి మోహనరావు తెలిపారు. టీడీపీ నాయకులు విష్ణు చౌదరి, వంశీతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు అల్లు రమణ, మొదలవలస మన్మధ.. కానిస్టేబుల్ నారాయణ విధులకు ఆటంకం కలిగించినట్లు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఎస్పీగారూ.. ఏం జరుగుతోంది?
ఎస్పీగారూ.. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ఏం జరుగుతోంది. పోలీసుల సమక్షంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జరిగిన ఘటనపై ఎఫ్‌ఐఎర్ నమోదు చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి.
– విజయసాయిరెడ్డి, ఎంపీ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు
రాష్ట్రంలో.. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు జరిగిన పలాసలో ఇప్పుడు మళ్లీ అరాచకం రాజ్యమేలుతోంది.
టీడీపీ నాయకుడు బాలికపై దాడి చేస్తే పోక్సో కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తమపై హత్యాయత్నం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవారిపై టీడీపీ వర్గీయులు దాడిచేసినా పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నారు. ఇక్కడి గూండాలను స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నారని మండిపడ్డారు.
– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment