కొలిమిగుండ్ల: మరికొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. ఈ వేడుక కోసం బంధువులంతా తరలిరావడంతో సందడి నెలకొంది. మరో వైపు వధువు తరఫు వారు వరుడి ఇంటికి బయలుదేరారు. వరుడి కుటుంబ సభ్యులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంతలో వరుడి తల్లి గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బూసిగారి కంబయ్య, దేవమ్మ(45) దంపతులకు ముగ్గురు కుమారులున్నారు.
చివరి కుమారుడు లక్ష్మణుడికి వైఎస్‌ఆర్ జిల్లా పెద్దముడియం మండలం ఎస్. ఉప్పలపాడుకు చెందిన యువతితో వివాహం కుదిరింది. శనివారం ఉదయం 8 గంటలకు వరుడి స్వగృహంలోనే పెళ్లి తంతు జరగాల్సి ఉంది. సంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకును చేశాక బంధువులందరితో కలసి గ్రామంలోని దేవాలయాల్లో టెంకాయలు కొట్టేం దుకు మేళతాళాలతో బయలు దేరి వెళ్లారు. ఇంటి వద్దే ఉన్న దేవమ్మ ఒక్క సారిగా గుండె పోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. అంతవరకూ ఉత్సాహంగా గడిపిన ఆమె ఇక లేదని తెలియడంతో కుటుంబ సభ్యులు, బం«ధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment