
'పెళ్లి చేయమన్నందుకు యువతిపై క్షుద్రపూజలు'
హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలో అమానుషం చోటుచేసుకుంది. ప్రేమించినందుకు ఓ యువతిపై.... మంత్రాల పేరిట ఓ యువకుడి కుటుంబ సభ్యులు అకృత్యాలకు తెగబడ్డారు. ఆ బాధలను తట్టుకోలేక... యువతి బలవన్మరణానికి పాల్పడింది. బ్లాక్ హెన్నా తాగి ప్రాణాలొదిలింది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన లేఖతో....ఈ ఉదంతం వెలుగుచూసింది.
సూసైడ్ నోట్ ప్రకారం....బాటసింగారం మండలం కొత్తగూడకి చెందిన తెండీ సాధిక్ కుమార్తె సోనీ, సాగర్ అనే యువకుడు.... ఒకరికొకరు ప్రేమించుకున్నారు. విషయం సాగర్ తల్లిదండ్రులకు కూడా తెలుసు. పెళ్లి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే మనసులో ఏం పెట్టుకున్నారో తెలియదు కాని...క్షుద్రపూజలకు తెగబడ్డారు. తమకు సహకరిస్తే పెళ్లి చేస్తామని..ఎదురు కట్నం కూడా ఇస్తామని ఒప్పించారు.
పలుమార్లు క్షుద్రపూజల్లో కూర్చోమంటూ సోనీపై ఒత్తిడి చేశారు. మంత్రాల వల్ల ఒరిగేదీ ఏమీ లేదని పలుమార్లు చెప్పినా వినలేదు. సహకరించకపోతే యువతి కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించారు. తన చావుకు నోముల నర్సింహ, అతని భార్య చంద్రకళ, వారి బంధువు గణేష్... కుటుంబసభ్యులు గురునాధ్, సాగర్ కారణమని ఆమె లేఖలో పేర్కొంది. అనంతరం ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన సోనీ కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతి చెందింది. మరోవైపు సోనీ లేఖ ఆధారంగా మృతురాలు కుటుంబసభ్యులు....పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.