సూచిక బోర్డు దిమ్మెను ఢీకొన్న కారు
చిత్తూరు, బంగారుపాళెం: మండలంలోని నలగాంపల్లె వద్ద హైవేపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ రామకృష్ణయ్య కథనం..పలమనేరుకు చెందిన రంగబాబు బెంగళూరులోని చిక్‌బాన్స్‌వాడలో నివాసం ఉంటున్నారు. వేలూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలసి బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో నలగాంపల్లె వద్ద హైవే మీద ఏర్పాటు చేసిన సూచిక బోర్డు దిమ్మెను కారు ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అంజనమ్మ(45) సంఘటన స్థలంలోనే మృతి చెందింది. రంగబాబు(62), అతని కుమారుడు ప్రసన్నకుమార్(40), బంధువు చంద్రశేఖర్ కుమారుడు శ్రీహరి(15) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో బంగారుపాళెం వైద్య విధాన పరిషత్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. శ్రీహరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అంజనమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీపు ఢీకొని మోటార్ సైక్లిస్టు మృతి
తిరుపతి క్రైం : జీపు ఢీకొని మోటార్ సైక్లిస్టు దుర్మరణం చెందిన సంఘటన బుధవారం తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో 34వ మలుపు వద్ద చోటుచేసుకుంది. వివరాలు..తిరుపతిలోని తిరుమలనగర్‌లో నివాసముంటున్న బలరాం (47) తిరుమలలోని ఓ షాపులో పనిచేసేవాడు. పనిముగించుకుని మోటార్ సైకిల్‌పై తిరుపతికి వస్తూ మృత్యువాత పడ్డాడు. 34వ మలుపు వద్ద వెనుక నుంచి జీపు అతడిని ఢీకొనడంతో బలరాం డివైడర్‌పై పడ్డాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment