
సాక్షి, చిత్తూరు: నడి వయసులో గర్భం దాల్చిన వివాహిత స్వయంగా అబార్షన్ చేసుకొని ప్రాణాలను కోల్పోయింది. ఇంట్లో పెళ్లి వయస్సు వచ్చిన ఇద్దరు పిల్లలుండగా ఓ మహిళ మరోసారి గర్భం దాల్చడంతో, ఈ వయసులో ప్రసవిస్తే చుట్టుపక్కల వాళ్లు సూటిపోటి మాటలు అంటారని భావించి తనకు తానే బలవంతంగా అబార్షన్ చేసుకోవడానికి ప్రయత్నించింది. చివరకు తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలతో బయటపడ్డ ఆడ శిశువు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
వివరాలు.. మదనపల్లెలోని అమ్మినేని వీధి సమీపంలో నివసిస్తున్న ఇనయతుల్లా, కదిరున్నీషా (45) దంపతులు టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నారు. అయితే ఎనిమిది నెలల క్రితం కదిరున్నీషా (45) గర్భం దాల్చింది. ఈ విషయాన్ని భర్తకు తెలియకుండా రహస్యంగా ఉంచింది. రాను రాను ఉదరభాగం ముందుకువచ్చి గర్భం దాల్చినట్టు కనబడటంతో ఆందోళన చెందిన మహిళ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్‌రూంలో బలవంతంగా అబార్షన్ చేసుకుంది. వెలికి వచ్చిన ఆడశిశువును ప్లాస్టిక్ కవర్లో చుడుతూ అధిక రక్తస్రావం కారణంగా బాత్‌రూంలోనే కుప్పకూలిపోయింది. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇది గమనించి ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కదిరున్నీషా మరణించింది. శిశువుకు వైద్యులు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా భార్య చనిపోవడంతో భర్త ఇనయతుల్లా, పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment