సాక్షి, చిత్తూరు : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు అలేఖ్య (27), సాయిదివ్య (22)లకు హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పద్మజ, పురుషోత్తమ్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 24వ తేదీన పురుషోత్తం నాయుడు, ఆయన భార్య పద్మజ క్షుద్రపూజల పేరుతో తమ కుమార్తెలు అలేఖ్య, సాయిదివ్యను ఇంట్లో కిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకుని రెండు రోజలు పాటు సుదీర్ఘ విచారణ జరిపిన పోలీసులు.. తల్లిదంద్రులను నిందితులుగా చేర్చారు. ఎఫ్‌ఐఆర్ నెంబర్ 31/2021లో A1గా పురుషోత్తం, A2గా పద్మజ చేర్చారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. (మూఢనమ్మకంతోనే.. బలిచేశారు)
అరెస్ట్ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదట చిన్న కుమార్తె సాయిదివ్వను ఆదివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో 2:30 గంటల సమయంలో తల్లి పద్మ హత్య చేసింది. అత్యంత దారుణంగా డంబెల్స్‌తో తలపై బలంగా కొట్టి హతమార్చింది. ఆ తరువాత మరోసారి క్షుద్రపూజలు చేసి మొదటి ఫ్లోర్‌లో పెద్ద కుమార్తె అలేఖ్యను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పూజ గదిలో తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి హతమర్చారు. ఆ తరువాత రాత్రి 7:30 గంటలకు పురుషోత్తం నాయుడి సన్నిహితుడు జీపీ రాజు ఫోన్ ద్వారా విషయం తెలపగా.. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉన్నత చదువులు చదవి, కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పొందిన పురుషోత్తం నాయుడు, ఓ పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా ఉన్న పద్మజ ఇద్దరు కుమార్తెలను క్షుద్రపూజల పేరుతో హతమర్చాడం సామాన్య మానవులతో పాటు పోలీసులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాకుండా ఈ కేసును ఛేదించడం వారికి సవాలుగా మారింది. హత్య జరిగిన సమయం నుంచి అంతకుముందు నాలుగు రోజుల పాటు వారికి ఇంటి ఎవరెవరు వచ్చారు. ఏ మంత్రగాడు వచ్చాడు అనే దానిపై ప్రధానంగా దృష్టిసారించి విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు నిందితులు విస్తుపోయే విషయాలను వెల్లడించినట్లు సమచారం. దైయ్యం పట్టిన తమ ఇద్దరు కూతుళ్లను తామే హతమార్చామని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిందితులు మానసిన స్థితి బాగానే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టి అనంతరం పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై త్వరలోనే చార్జ్‌షీట్ సైతం దాఖలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment